
భార్య మెకంజీతో అమెజాన్ సీఈవో, కంపెనీ బాస్ జెఫ్ బెజోస్ ఒప్పందం ఖరారు చేసుకున్నారా? కొన్ని లక్షల కోట్లు ఆమెకు ఇస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఆ పరిణామాలను దగ్గర్నుంచి చూస్తున్న వర్గాలు. విడాకులు తీసుకుంటున్నట్టు ఆ ఇద్దరు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెజోస్ సగం ఆస్తిని మెకంజీకి ఇవ్వాల్సి వస్తుందన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజాగా శుక్రవారం ఆమెతో సుమారు ₹2.62 లక్షల కోట్లకు (3830 కోట్ల డాలర్లు) బెజోస్ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీలోని 1.97 కోట్ల షేర్లు ఆమె సొంతం కాబోతున్నాయని చెబుతున్నారు. దాంతో కంపెనీలో ఆమె వాటా 4 శాతం ఉంటుందని అంటున్నారు. ఆ సంపదతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మెకంజీ 22వ స్థానానికి చేరుకుంటారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అంత సంపద పోయినా ఎప్పటిలాగే బెజోసే ప్రపంచ కుబేరుడిగా ఉండనున్నారు. 12 శాతం వాటా ఆయనకు కంపెనీలో అందుతుంది.