నేపాల్ గ్యాంగ్‌లో మ‌రో ముగ్గురు అరెస్ట్

నేపాల్ గ్యాంగ్‌లో మ‌రో ముగ్గురు అరెస్ట్

రాయదుర్గం కాంట్రాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ లో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఈ దోపిడి వ్య‌వ‌హారానికి సంబంధించి మీడియాతో మాట్లాడారు. నేపాలీ గ్యాంగ్ వాచ్ మెన్ , పనిమనుషులుగా ఇంట్లో చేరారు. ఈ ఘటనలో పాల్గొన్నవారిలో జానకి బుదాయర్, చక్ర బుల్ ,అఖిలేష్ కుమార్ ను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అరెస్ట్ చేశామ‌ని అన్నారు.

ఈ గ్యాంగ్ లో జానకి అనే మ‌హిళ మధుసూదన్ కుటుంబ సభ్యులకు వంట అండి అందులో నిద్ర‌మాత్ర‌లు కలిపి ఇచ్చింద‌ని, వారు మ‌త్తులోకి జారుకున్నాక మిగిలిన గ్యాంగ్ కు సమాచారం ఇచ్చిందని చెప్పారు. ఆమె స‌హ‌కారంతో ఆ గ్యాంగ్ ఈ నెల 5 వ తేదిన దోపిడీ చేసి బంగారం, డబ్బు ఎత్తుకెళ్లారని డీసీపీ తెలిపారు.

ఈ కేసులో గత వారం నేత్ర బహదూర్,ప్రకాష్ షాహీ,సీతలను అరెస్ట్ చేశామ‌ని, మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేయ‌గా…మరో నలుగురు పరారీ లో ఉన్నార‌న్నారు. నిందితుల నుంచి 4లక్షల 50 వేల విలువ చేసే 83 గ్రాముల బంగారం,17 వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు. మిగతా నిందితుల కోసం మూడు టీం లు వెతుకుతున్నాయని చెప్పారు.

ఈ గ్యాంగ్ ధనవంతుల ఇండ్ల లో పనికి కుదిరి , నమ్మకంగా పని చేసి, ఆ త‌రువాత స‌మ‌యం చూసి దోపిడీ చేస్తార‌న్నారు. దోపిడీ అనంత‌రం తలో దారిలో నేపాల్ చేరుకుంటార‌ని అన్నారు. న‌గ‌రంలో ఎవ‌రైనా త‌మ ఇళ్ల‌ల్లో నేపాల్ నుంచి వచ్చి పనికి చేరే వారి వివరాలను పోలీస్ స్టేషన్ లో ఇవ్వాల‌ని డీసీపీ సూచించారు. వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతనే పనిలో పెట్టుకోవాలని జాగ్ర‌త్త‌లు తెలిపారు.