రివ్యూలే కాదు, దిద్దుబాటు చర్యలుంటాయి: మధు యాష్కీ

రివ్యూలే కాదు, దిద్దుబాటు చర్యలుంటాయి: మధు యాష్కీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ కు వరుస ఓటములు ఎదురవడం విచారకరమని, పార్టీకి తెలంగాణ ప్రజల మద్దతు ఎందుకు రావడం లేదో సమీక్షించాల్సిన అవసరం ఉందని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీగౌడ్ అన్నారు. ప్రియాంక గాంధీ త్వరలో తెలంగాణ బాధ్యతలు తీసుకోబోతున్నారని, ఆమె వచ్చిన తర్వాత సమీక్షలతోపాటు దిద్దుబాటు చర్యలు కూడా ఉంటాయన్నారు. శుక్రవారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో ధన ప్రభావంతోనే ఓడిపోయామని సమర్థించుకోలేమని చెప్పారు. పార్టీ ఎన్నికను సీరియస్​గానే తీసుకుందని, నేతలు కలిసి కట్టుగా పని చేశారన్నారు. అయినా ఓడటం ఆలోచించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో పార్టీని మెరుగుపర్చుకోవాల్సిన టైమ్ వచ్చిందన్నారు.

ఢిల్లీ లిక్కర్​ పాలసీపై సీబీఐతో విచారణ జరిపించాలని యాష్కీ డిమాండ్ చేశారు. దేశంలో అత్యధికంగా లిక్కర్ సేల్ జరుగుతున్నది తెలంగాణలోనని, ఇక్కడి పాలసీనే పంజాబ్, ఢిల్లీ కాపీ కొట్టాయన్నారు. డ్రగ్స్ అమ్మకాల్లో కూడా రాష్ట్రం టాప్​లో ఉందన్నారు. గతంలో నమోదైన డ్రగ్స్ కేసు ఏమైందో అర్థం కావడం లేదని, ఇప్పుడు లిక్కర్ స్కామ్​కు అదే పరిస్థితి కల్పించవద్దని అన్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినపుడు టీఆర్ఎస్ గొడవ చేస్తుందని, తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోడీ కాళ్లమీద పడతారన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ, టీఆర్ఎస్ గొడవ పడతాయన్నారు. ఫోన్ ట్యాపింగ్​పై గవర్నర్ తమిళిసైకి అనుమానం ఉంటే హోంశాఖకు ఫిర్యాదు చేయాలన్నారు. తెలంగాణ సర్కార్ ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయం నిజమేనని, ప్రతిపక్ష నాయకుల ఫోన్​లు కూడా ట్యాప్ చేస్తున్నారన్నారు.