మంత్రి తలసానివి తలకాయ లేని మాటలు : మధు యాష్కీ గౌడ్​

మంత్రి తలసానివి తలకాయ లేని మాటలు : మధు యాష్కీ గౌడ్​

హైదరాబాద్, వెలుగు : మంత్రి తలసాని.. తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. యాదవ కులస్తుల బతుకులు మారలేదుగానీ.. తలసాని కొడుకులు మాత్రం రాజకీయాలు చేసుకుని బతుకుతున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్​బీసీ ద్రోహులని ఫైర్​ అయ్యారు. రాష్ట్ర ఏర్పాటులో బడుగు బలహీన వర్గాల పాత్ర కీలకమని, అలాంటి వాళ్ల కోసం కర్నాటక సీఎం సిద్ధరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్​ను ప్రకటించామని తెలిపారు. శనివారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక బీసీ సబ్​ ప్లాన్​ ద్వారా బీసీల అభివృద్ధికి ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. బలహీన వర్గాలకూ ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. 

అర్హులైన బీసీ విద్యార్థులకు రూ.10 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ప్రొఫెసర్​ జయశంకర్​ ఐక్యతా భవనాల కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో నవోదయ విద్యాలయాలకు సమాంతరంగా బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీ కులాలకు వృత్తి బజార్ల ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు. గీత కార్మికుల మాదిరిగా ఇతర కులాల వారికీ 50 ఏండ్లకే పింఛన్​ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముదిరాజ్​ కులస్తులను బీసీ ఏలోకి మారుస్తామన్నారు. ప్రతి గ్రామంలో గౌడ కులస్థులకు 90% సబ్సిడీపై ఈత, తాటి వనాల పెంపకం కోసం 5 ఎకరాల భూమి ఇస్తామన్నారు. జనగామ జిల్లా పేరును సర్వాయి పాపన్నగౌడ్​ జనగామ జిల్లాగా మారుస్తామని మధు యాష్కీ గౌడ్ చెప్పారు. 

ప్రభుత్వ ఆస్తులపై బీఆర్​ఎస్​ ప్రచారం

ప్రభుత్వ భవనాలపై బీఆర్ఎస్​ పార్టీ వాల్​ పోస్టర్లు వేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నదని మధు యాష్కీ గౌడ్​ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులపై రాజకీయ పార్టీ ఎలా ప్రచారం చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్​ కార్యకర్తలను ఎల్బీ నగర్​ ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.  దీపావళి పండుగ వచ్చినా ప్రభుత్వ టీచర్లకు ప్రభుత్వం ఇంకా జీతాలే వెయ్యలేదని ఫైర్​ అయ్యారు.