ఓటమి భయంతోనే ఐటీ దాడులు

ఓటమి భయంతోనే ఐటీ దాడులు

ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూసి ఓర్వలేక ఓడిపోతామనే భయంతోనే బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులపై ఐటి దాడులు చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎల్బీనగర్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ అన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు వద్ద మార్నింగ్ వాకర్స్ ను కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్బంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. కోట్లు వెచ్చించి చెరువుల సుందరీకరణ చేస్తూన్నామని.. పెద్ద చెరువును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పి.. మంత్రి కేటీఆర్ దగా చేశారని ఫైర్ అయ్యారు.  పెద్ద చెరువు నుంచి వెదజల్లుతున్న దుర్వాసనతో పరిసర కాలనీల ప్రజలు, మార్నింగ్ వాకర్స్, అనారోగ్య సమస్యల పాలవుతున్నారని అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటాలకు ఇచ్చిన ప్రాధాన్యత.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదని విమర్శించారు.  

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకుల ఇంట్లో జరుగుతున్న దాడులపై మధుయాష్కీ స్పందిస్తూ.. బీఆర్ఎస్, బీజేపి పార్టీల దొస్తాన్ ఎలా ఉందో అర్థం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే భయపెడుతూ  బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎల్బీనగర్ లో సుధీర్ రెడ్డి.. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మధుయాష్కీ  అన్నారు.  

ALSO READ :- నేను చచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టనని మోదీకి చెప్పిన : కేసీఆర్