ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత సన్నిహితులు!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత సన్నిహితులు!

అగ్గిపుల్ల, కుక్కపిల్ల కాదేదీ 'కవిత'కు అనర్హం అన్నట్టుగా..  ఎమ్మెల్సీ కవిత అక్రమ సొమ్మును పోగేయడంలో కాదేదీ అనర్హం అన్నట్టుగా దోపిడీకి పాల్పడ్డారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. ఎమ్మెల్సీ కవితకు సన్నిహితులైన పలువురి పేర్లు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నట్టు సీబీఐ చెబుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ పేర్కొన్నారు. ఇవాళ ఐటీ దాడులను ఎదుర్కొన్న ఫీనిక్స్ సంస్థకు, కవితకు చెందిన జాగృతి సంస్థతో లింకులు ఉన్నాయని ఆరోపించారు. హైదరాబాద్ లో లిక్కర్ లైసెన్సుల జారీ విషయంలో బామ్మర్దుల పాత్ర గురించి కేసీఆర్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 

గురుకుల్ ట్రస్ట్ భూముల ఆక్రమణలను కూల్చే సమయంలో.. కవిత అడ్డుకున్నారని మధు యాష్కీ చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు అన్ని అంశాల్లోనూ 30% కమిషన్లు  దోచుకుంటోందని మండిపడ్డారు. ఇసుక, రియల్ ఎస్టేట్ దందాల్లో టీఆర్ఎస్ నేతలకు భాగస్వామ్యం ఉందన్నారు. అవినీతి ఆరోపణలు ఎదురైనప్పుడు సీఎంలను , కేంద్ర మంత్రులను కూడా తప్పించి, జైళ్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని మధు యాష్కీ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద ఉత్తుత్తి ఆరోపణలు చేయకుండా.. ఆధారాలతో సహా నిరూపించాలని టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు.