
హైదరాబాద్ : బర్కత్ పురాలో ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ మధులిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితిని యశోద హాస్పిటల్ డాక్టర్లు వివరించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మధులిక శరీరం.. ఇంకా వైద్యానికి సహకరించడం లేదని డాక్టర్లు చెప్పారు. బీపీ లెవెల్స్ ఇంకా పూర్తి స్థాయిలో నార్మల్ లోకి రావాల్సి ఉందన్నారు. ఐదుగురు సభ్యుల డాక్టర్ల బృందం మధులికకు అవసరమైన వైద్యాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. గాయాలైన ప్రాంతాల్లో రక్త స్రావం ఆగిందని వివరించారు డాక్టర్లు.
నిందితుడు భరత్ ను ఉరి తీయాలి : మధులిక పేరెంట్స్
ఇంటర్ సెకండియర్ చదువుతున్న మధులికపై… బుధవారం ఉదయం 8.45 నిమిషాలకు బర్కత్ పురాలో ప్రేమోన్మాది భరత్ కత్తితో దాడిచేశాడు. ప్రేమ పేరుతో రెండేళ్లుగా వేధించిన భరత్ ను.. బాధితురాలి తల్లిదండ్రులు హెచ్చరించినా.. అతడి వైఖరిలో మార్పురాలేదు. పద్ధతి మార్చుకోవడం లేదంటూ పోలీస్ స్టేషన్ లోనూ భరత్ పై మధులిక పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఉన్మాదిలా మారిన భరత్… మధులికపై కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కూతురుపై దాడిచేసిన భరత్ ను ఉరితీయాలని బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు.