తమ్ముడికి హెచ్ఐవీ ఉందని బయటపెట్టిన యాక్సిడెంట్.. బ్లడ్ టెస్ట్తో నిజం వెలుగులోకి.. అంబులెన్స్లోనే చంపేసిన అక్కాబావ..!

తమ్ముడికి హెచ్ఐవీ ఉందని బయటపెట్టిన యాక్సిడెంట్.. బ్లడ్ టెస్ట్తో నిజం వెలుగులోకి.. అంబులెన్స్లోనే చంపేసిన అక్కాబావ..!

చిత్రదుర్గ: కర్ణాటకలో అమానుష ఘటన జరిగింది. హెచ్ఐవీ సోకిన 23 ఏళ్ల యువకుడిని తన సొంత అక్కాబావ గొంతు నులిమి చంపేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. తన తమ్ముడికి ఎయిడ్స్ ఉందని ఊళ్లో వాళ్లకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించిన ఆ యువకుడిని భార్యాభర్త కలిసి చంపేశారు. ఈ తరహాలో పరువు హత్య జరగడం కర్ణాటకలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎయిడ్స్ సోకిన వారి పట్ల సమాజం మాత్రమే కాదు, సొంత కుటుంబం తీరు కూడా ఎంత వివక్షపూరితంగా ఉంటుందో కళ్లకు కట్టిన అమానుష ఘటన ఇది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక చిత్రదుర్గ జిల్లా హోళల్ కెరె తాలూకాలోని దుమ్మి అనే గ్రామంలో మల్లిఖార్జున్ అనే యువకుడు ఉన్నాడు. బెంగళూరులోని గార్మెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేసే మల్లిఖార్జున్ అప్పుడప్పుడు సొంతూరు వచ్చి వెళుతుండేవాడు. మల్లిఖార్జున్ కు నిషా అనే అక్క ఉంది. నిషా ఒక యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. మల్లిఖార్జున్ కు పెళ్లి కాలేదు. గతంలో మాదిరిగానే జులై 23న మల్లిఖార్జున్ సొంతూరికి తన ఫ్రెండ్స్ తో కలిసి కారులో వస్తుండగా ఆ కారుకు ప్రమాదం జరిగింది. ఆ కారు లారీని ఢీ కొట్టడంతో మల్లిఖార్జున్ కు తీవ్ర గాయాలయ్యాయి.

అతని స్నేహితులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడిన మల్లిఖార్జున్ అతని స్నేహితులను చిత్రదుర్గ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి అతని అక్కాబావ, తల్లిదండ్రులు హాస్పిటల్కు వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం మల్లిఖార్జున్ ను దావణగెరెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో సర్జరీ చేయాలని డాక్టర్లు డిసైడ్ అయ్యారు. సర్జరీకి ముందు మల్లిఖార్జున్కు రెగ్యులర్ ట్రీట్మెంట్లో భాగంగా బ్లడ్ టెస్ట్ చేయగా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. ఈ విషయం మల్లిఖార్జున్ అక్కాబావకు వైద్యులు చెప్పారు. ఈ విషయం మిగిలిన వాళ్లెవరికీ తెలియదు. కాలుకు తీవ్ర గాయమై.. అతనికి కంట్రోల్ చేయలేని విధంగా బ్లీడింగ్ అవుతుందని.. ఇక్కడ సర్జరీ కష్టమని.. బెంగళూరుకు తరలించారని డాక్టర్లు చెప్పారు. దీంతో.. మల్లిఖార్జున్ తల్లిదండ్రులు అతని అక్కాబావను అంబులెన్స్లో వెళ్లాలని చెప్పారు.

►ALSO READ | ఈ బామ్మా మాములు బామ్మా కాదు.. 70 ఏళ్ల వయస్సులో కూడా తగ్గేదేలే..

హెచ్ఐవీ విషయం తెలిసిన మల్లిఖార్జున్ అక్కాబావ ఈ విషయం బయట తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించారు. బెంగళూరుకు అతనిని అంబులెన్స్లో తరలించే క్రమంలో మల్లిఖార్జున్ గొంతు నులిమి చంపేశారు. బెంగళూరు తీసుకెళుతుంటే దారి మధ్యలో తీవ్ర గాయాల కారణంగా బ్లీడింగ్ అయి చనిపోయాడని మల్లిఖార్జున్ తల్లిదండ్రులతో పాటు ఊరందరినీ నమ్మించారు. బెంగళూరు నుంచి సొంతూరికి మల్లిఖార్జున్ డెడ్ బాడీతో చేరుకున్నారు. అంత్యక్రియల సమయంలో మల్లిఖార్జున్ గొంతు దగ్గర నులిమినట్టుగా మచ్చలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానమొచ్చింది. మల్లిఖార్జున్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అతని అక్కాబావను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం పరువు హత్య మాత్రమే కాదని, కులాంతర వివాహం చేసుకున్నందు వల్ల.. మల్లిఖార్జున్ అక్కాబావ ఆ కుటుంబం ఆస్తిపై కన్నేసి అతని అడ్డు తొలగించుకున్నారని గ్రామస్తులు వాపోయారు.