దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ పై జరిగిన ఒక సర్వేలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. చాలా మంది వాహనదారులు దీనిని ఆపేయాలని గతంలో లాగా E0 లేదంటే E10 పెట్రోల్ అంటే తక్కువ ఇథనాల్ కలిపిన వేరియంట్లను ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టాలని పాత వాహనాల ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు. E20 పెట్రోల్ వల్ల వస్తున్న రిపేర్లతో వేలకువేలు ఖర్చవుతోందని దండం పెట్టేస్తున్నారు. కొత్తవి కొనుక్కోలేక పాతవాటినే నడుపుకుంటున్న కోట్ల మంది వెహికల్ ఓనర్స్ రిపేర్లు, మైలేజ్ డ్రాప్ సమస్యలతో చుక్కలుచూస్తున్నట్లు తాజా సర్వే బయటపెట్టింది.
దేశంలో రోడ్డెక్కిన ప్రతి పాత బండి ఇప్పుడొక సైలెంట్ పోరాటం చేస్తోంది. 2022 లేదా అంతకంటే ముందు కొన్న పెట్రోల్ వాహనాల యజమానుల గుండెల్లో ఇప్పుడు ఇథనాల్ మంటలు రేగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌ను తీసుకొచ్చినప్పటి నుంచి కథ అడ్డం తిరిగింది. పర్యావరణం బాగుపడుతుందో లేదో కానీ.. సగానికి పైగా వాహనదారుల జేబులకు మాత్రం భారీగా చిల్లులు పడుతున్నాయని లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. మైలేజ్ దారుణంగా పడిపోవడమే కాక.. ఇంజన్లు మొరాయిస్తుండటంతో జనం లబోదిబోమంటున్నారు.
ఏంటయ్యా E20 బాధ?
దేశవ్యాప్తంగా 316 జిల్లాల్లోని దాదాపు 42వేల మంది పాత వాహనదారులను కదిలిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కేవలం 2025 ప్రారంభం నుంచే.. దాదాపు 52% మంది వాహనదారులు అదనపు రిపేర్ల కోసం, పెట్రోల్ ఖర్చుల కోసం ఏకంగా రూ.5వేల నుంచి రూ.25వేలకు పైగా ఖర్చు పెట్టారట. అందులో 9% మందికైతే ఆ నష్టం రూ.25వేలు దాటేసింది. కేవలం 11% మంది మాత్రమే ఎలాంటి అదనపు భారం పడలేదని ఊపిరి పీల్చుకున్నారు. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లు, ఫ్యూయల్ ట్యాంకులు, కార్బ్యురేటర్లు తుప్పుపడుతూ అరుగుదలకు గురవుతున్నాయని మూడొంతుల మంది వాపోతున్నారు.
పరిస్థితి ఎంత క్రేజీగా మారిందంటే.. పాత E0 లేదా E10 పెట్రోల్‌ను తిరిగి తీసుకువచ్చేయండి మహాప్రభో. కావాలంటే రెండు రూపాయలు ఎక్కువైనా ఇస్తాం అని 31% మంది నెత్తీ నోరు బాదుకుంటున్నారట. మరో 24% మంది సమాన ధర ఉంటే పాత పెట్రోల్‌కే ఓటేస్తామంటున్నారు. మొత్తంగా 55% మంది వాహనదారులు పాత పెట్రోల్ తిరిగి తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మెుత్తానికి దేశంలో జస్ట్ 12% మంది వాహనదారులు మాత్రమే E20 పెట్రోల్ తో హ్యాపీగా ఉన్నారని తేలింది.
E20 వాహనదారులకు ముందుంది ముసళ్ల పండగ:
అయితే ఈ స్టోరీ ఇక్కడితో ఆగట్లేదు. ప్రభుత్వం మాత్రం ఇథనాల్ ప్రయాణంలో గేర్ మార్చింది. ఇవాళే ఢిల్లీలో E85 ఇంధనాన్ని కూడా అధికారికంగా లాంచ్ చేసేసింది. 2026 మే నెలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏకంగా E22 నుండి E30 బ్లెండ్స్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పైగా కాలుష్యం తగ్గిస్తూ, విదేశీ క్రూడ్ దిగుమతులు తగ్గించడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు కూడా వినియోగదారుల ఇష్టాఇష్టాలు దేశ ఇంధన విధానాన్ని శాసించలేవని తేల్చి చెప్పింది. అంటే రానున్న కాలంలో ఇప్పుడు హ్యాపీగా ఉన్న E20 వాహనదారులు కూడా ఏడవక తప్పదనమాట. ఎందుకంటే పెట్రోలులో ఇథనాల్ శాతం మిక్స్ చేయటం పెరిగేకొత్తి ఇప్పుడు రోడ్డుపై తిరుగుతున్న ఒక్క వాహనం కూడా అందుకు సపోర్ట్ చేయదు. సో E20 వెహికల్ ఓనర్స్ కూడా మరికొన్ని నెలల్లో వేలకువేలు రిపేర్ల కోసం ఖర్చు చేసుకోక తప్పదనమాట.
