నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీసే హైపటైటిస్...వైరల్ హైపటైటిస్ గురించి చాలా మందికి తెలియదు

నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీసే హైపటైటిస్...వైరల్ హైపటైటిస్ గురించి  చాలా మందికి తెలియదు
  • లక్షణాలతో దీన్ని గుర్తించలేం 
  • ముందస్తు పరీక్షలతోనే నివారణ
  • కేర్ ​హాస్పిటల్స్​ డాక్టర్ ఆకాశ్​

హైదరాబాద్ సిటీ, వెలుగు : కాలేయ సంబంధిత వ్యాధులు, మరణాలకు వైరల్ హెపటైటిస్ ప్రధాన కారణంగా నిలుస్తోందని, ఎంతోమందికి ఈ వైరస్ సోకినా తెలియకుండానే జీవిస్తున్నారని కేర్​హాస్పిటల్స్​కు చెందిన డాక్టర్​ఆకాశ్​ తెలిపారు. జూలై 28న వరల్డ్​ హైపటైటిస్ ​డే సందర్భంగా ఆ వ్యాధి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

హైపటైటిస్​కాలేయంలో వాపు కలిగిస్తుందని, ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఏర్పడుతుందన్నారు. చాలా ఏండ్ల పాటు ఎటువంటి లక్షణాలు లేకుండా శరీరంలో ఉండి, నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీస్తుందన్నారు. దీనివల్ల గుర్తించడానికి ఆలస్యం అవుతుందన్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 354 మిలియన్ల మంది హెపటైటిస్ బి, సి వంటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు సోకాయన్నారు. వీటివల్ల లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడి ప్రతి సంవత్సరం దాదాపు 1.1 మిలియన్ల మంది చనిపోతున్నారని తెలిపారు. 

మన దేశంలో సుమారు 40 మిలియన్ల మందికి హెపటైటిస్ బి, 12 మిలియన్ల మందికి హెపటైటిస్ సి ఉందన్నారు. లిక్కర్​మానెయ్యడం, మంచి ఆహారం తీసుకోవడం, సురక్షితమైన లైంగిక సంబంధాలు, టీకాలు వేయించుకోవడం వల్ల  కాలేయం సురక్షితంగా ఉంటుందన్నారు. హెపటైటిస్ లక్షణాలతోనే బయటపడదని, అయితే, దీన్ని నివారించే మార్గం ఉందన్నారు. ఎర్లీ స్టేజ్​లో గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం కూడా సాధ్యమేనన్నారు.

 ఈ విషయమై బంజారా హిల్స్‌‌లో కేర్ హాస్పిటల్స్‌‌ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ ఆకాష్ చౌదరి మాట్లాడుతూ ‘హెపటైటిస్ బి లేదా సి వైరస్ సోకిన విషయం చాలా మందికి తెలియదు. వారు దవాఖానలో చేరే సమయానికి వారి కాలేయం అప్పటికే తీవ్రంగా దెబ్బతినిపోతుంది. సాధారణ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు’ అని అన్నారు. ప్రతి ఒక్కరూ లక్షణాల కోసం ఎదురుచూడకుండా, పరీక్షలు చేయించుకొని, టీకాలు వేయించుకోవడం ఉత్తమమన్నారు.