
Market Fall: ఉదయం స్వల్ప నష్టాలతో స్టార్ట్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం సమయానికి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 2.50 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ సూచీ 560 పాయింట్లకు పైగా నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిప్టీ 150 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రధానంగా రియల్టీ, మీడియా సూచీలు కూడా 3 శాతం వరకు నష్టంలో ఉన్నాయి.
శనివారం మార్కెట్ల భారీ పతనం తర్వాత కొత్త వారాన్ని కూడా నష్టాల్లోనే స్టార్ట్ చేయటానికి ముఖ్య కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
* ముందుగా గడచిన కొన్ని రోజులుగా కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న క్యూ1 ఫలితాలు కొత్త ట్విస్ట్ కలిగి ఉన్నాయి. కంపెనీల ఆదాయాలు ఒకపక్క గత ఏడాది కంటే తగ్గుతూ ఉండగా.. లాభాలు మాత్రం పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ ట్రెండ్ తగ్గిన డిమాండ్ ను సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. తగ్గుతున్న అమ్మకాలతో గడచిన 4 త్రైమాసికాల్లో చెత్త పనితీరును క్యూ1లో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులు వ్యాపారాలకు గడ్డు పరిస్థితులను సూచిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* ఇక మార్కెట్లలో వరుస నష్టాలకు తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు కూడా మరో కారణంగా వెల్లడైంది. కేవలం గడచిన శుక్రవారం ఒక్కరోజే రూ.వెయ్యి 980 కోట్లు విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు FIIలు. గడచిన మెుత్తం వారంలో వారు 13వేల 552 కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులను అమ్మినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ నిపుణులు వికే విజయకుమార్ వెల్లడించారు.
* దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగుల లేఆఫ్స్ గురించి చేసిన కీలక ప్రకటన తర్వాత ఐటీ సూచీలోని కంపెనీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అమ్మకాల ఒత్తిడితో విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా స్టాక్స్ కుప్పకూలాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో నష్టాల పవనాలు ఆసియా మార్కెట్లకు తాకటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నాయి.