
భారతీయులు లేని అమెరికా అభివృద్ధిని ఊహించగలమా? ఐటీ రంగం నుంచి స్పేస్ రంగం వరకు భారతీయులు కీలకస్థానాల్లో పనిచేస్తున్నారు. అనేక కంపెనీల భవిష్యత్ వీరి నిర్ణయాలపై ఆధారపడి ఉందన్నది అతిశయోక్తి కాదు. ప్రతి ఏటా వేలసంఖ్యలో వెళ్లే భారతీయులు అక్కడి ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మన భారతీయులను అమెరికా కంపెనీలు, చవకగా లభించే మేధస్సుగా చూస్తుంటాయి. అలాంటిది వీరులేని అమెరికా ప్రగతి తాత్కాలికంగానైనా వెనుకపడక తప్పదు. ట్రంప్‌కు ఈ విషయం తెలియక కాదు, తెలిసే.. ఇబ్బందవుతుందని లెక్కలు కట్టి మరీ ఈ దిశగా తన నిర్ణయాన్ని ఆయన ప్రకటించాడు. తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులకన్నా దీర్ఘకాలికంగా వచ్చే ప్రయోజనాలను అంచనావేసి ఈ దిశగా అడుగు వేశాడు. అయితే, ఆయన ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయా?
భారతీయ ఐటీ నిపుణులు అమెరికా ఐటీ సెక్టార్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2023 డేటా ప్రకారం హెచ్1బి వీసా హోల్డర్లలో 70% భారతీయులే. ఈ నిర్ణయం వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి రంగాలలో నైపుణ్య కొరత ఏర్పడుతుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలకు ఈ నైపుణ్య కొరత వల్ల కొత్త ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయి. ఉదాహరణకు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ల లభ్యత తగ్గితే, ప్రాజెక్ట్ డెలివరీ టైమ్లైన్లు 20-–30% పెరగవచ్చు. భారతీయ ఐటీ నిపుణులు సాధారణంగా అమెరికా స్థానిక ఉద్యోగుల కంటే తక్కువ జీతంతో సగటున 30-–40% తక్కువ పనిచేస్తారు. హెచ్1బి వీసా వీసా ఆంక్షల వల్ల అమెరికా ఉద్యోగులను నియమించడం వల్ల కంపెనీల జీతాల ఖర్చు 15-–25% పెరిగే అవకాశం ఉంది. ట్రంప్ తన మొదటి టర్మ్ 2020లో హెచ్1బి ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచే నిబంధనలు విధించారు. ఇది కంపెనీల ఖర్చులను ఇప్పటికే పెంచింది. ఈ కొత్త విధానం ఈ ఒత్తిడిని మరింత తీవ్రతరం చేయకతప్పదు.
అవుట్ సోర్సింగ్ పై ప్రభావం
అమెరికా కంపెనీలు భారతదేశంలోని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలతో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులపై ఆధారపడతాయి. ఈ నిర్ణయం వల్ల ఈ ఒప్పందాలు గణనీయంగా తగ్గే అవకాశముంది. ఫలితంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలలో ఖర్చులు పెరగక తప్పదు. ఉదాహరణకు బీఎఫ్ఎస్ఐ సెక్టార్లో అమెరికా కంపెనీలు భారతీయ ఐటీ సేవల ద్వారా సంవత్సరానికి బిలియన్ల డాలర్లు ఆదా చేస్తాయి. ఈ సేవలు తగ్గితే, ఈ రంగంలో ఆపరేషనల్ ఖర్చులు 10-–15% పెరగవచ్చు. చైనా, యూరప్ దేశాల గ్లోబల్ టెక్ పోటీలో అమెరికా కంపెనీలు ముందు స్థానంలో ఉండటంలో భారతీయ నిపుణుల పాత్ర కీలకం. వీరు అమెరికా కంపెనీలకు ఆవిష్కరణలలో వేగాన్ని అందిస్తారు. ఈ నిర్ణయం వల్ల అమెరికా టెక్ సెక్టార్లో పోటీతత్వం తగ్గుతుంది. అమెరికన్లు ఆ స్థాయికి అంది వచ్చేంతవరకు కొంతమేరకు వెనకబడతారు.
ఇతర రంగాలపై కూడా..
ఆర్థిక రంగం: ఐటీ సేవలపై ఆధారపడే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు భారతీయ కంపెనీలపై ఆధారపడతాయి, ఇవి దాదాపు 60% రెవెన్యూను అమెరికా నుంచి పొందుతాయి. హెచ్1బి ఆంక్షలు, అవుట్ సోర్సింగ్ తగ్గుదలవల్ల ఈ రంగాలలో ఖర్చులు పెరగవచ్చు, కాంట్రాక్టులను మార్చవలసిరావచ్చు. కాదంటే ప్రాజెక్టులు ఆగిపోయే అవకాశంకూడా
లేకపోలేదు.
తయారీ రంగం: ట్రంప్ విధానాలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడంపై దృష్టి పెడతాయి. కానీ, ఐటీ సేవలు తయారీ ప్రక్రియలలో ఆటోమేషన్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కీలకమైనవి. భారతీయ ఐటీ సేవలు తగ్గితే, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో ఉత్పత్తి ఖర్చులు పెరగవచ్చు. ఐటీ ఖర్చులు పెరగడం వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్ సర్వీస్ సంబంధిత ఖర్చులు పెరగవచ్చు. ఇది అమెరికా వినియోగదారులకు ఉత్పత్తులు, సేవల ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం లేకపోలేదు.
వాణిజ్య ఒప్పందాలపై ప్రభావం
ట్రంప్ ‘రెసిప్రోకల్ టారిఫ్‌లు’ హెచ్1బి ఆంక్షలు భారత్-, అమెరికా వాణిజ్య సంబంధాలను ఒత్తిడికి గురిచేయక తప్పదు. భారతదేశం ప్రతీకార టారిఫ్‌లను విధించే పరిస్థితులకు దారితీయవచ్చు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలను సంక్లిష్టం చేసే అవకాశముంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అక్కడి కంపెనీలు గనుక ఇంప్లిమెంట్ చేస్తే...తాత్కాలికంగా నైపుణ్య కొరతను ఎదుర్కోవటంతో పాటు ఖర్చులు సైతం భారీగా పెరుగుతాయి. దానితో పాటు ప్రాజెక్టులు ఆలస్యం అవకతప్పదు. అయితే, ఈ నిర్ణయం కొంతమేర లోకల్ టాలెంట్ అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అవుట్ సోర్సింగ్ అవసరాలు తగ్గుతాయి. భారత్‌కు కూడా తాత్కాలికంగా ఐటీ ఎగుమతుల క్షీణత తప్పకపోవచ్చు. ఆర్థిక అస్థిరతతోపాటు కంపెనీల ఆదాయంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలంలో కొత్త మార్కెట్లలో వైవిధ్యీకరణ, స్థానిక ఆవిష్కరణలు, ఆర్థిక వ్యవస్థ ఇతర రంగాల అభివృద్ధి సాధ్యం అవ్వవచ్చు.
మనపై ప్రభావం
ట్రంప్ నిర్ణయం మన దేశంపై కూడా గట్టి ప్రభావమే చూపనుంది. ఐటీ ఎగుమతులు భారీగా తగ్గే అవకాశంతో పాటు, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఆర్ధికంగా కూడా కొంతమేర ఇబ్బంది తప్పదు. భారత ఐటీ పరిశ్రమ అమెరికా నుంచి 254 బిలియన్ల డాలర్ల రెవెన్యూలో గణనీయమైన భాగాన్ని పొందుతుంది. ఇది దాదాపు 80% ఎగుమతులను సూచిస్తుంది. హెచ్1బి ఆంక్షలు, అవుట్ సోర్సింగ్ తగ్గుదల వల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి టెక్ కంపెనీల ఆదాయం తగ్గవచ్చు. 75% కంపెనీలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారతీయ ఐటీ ఉద్యోగులు, ముఖ్యంగా హెచ్1బి వీసాలపై అమెరికాలో పనిచేసేవారు, ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది. భారతీయ ఐటీ నిపుణుల భారీ తిరోగమనం తప్పదు. ఇది భారతదేశంలో ఉద్యోగ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచే అవకాశముంది. ఈ ఆంక్షలు భారతీయ ఐటీ కంపెనీలను యూరప్, మిడిల్ ఈస్ట్ వంటి ఇతర మార్కెట్ల వైపు మళ్లించవచ్చు. ఇది దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవచ్చు. కానీ స్వల్పకాలంలో ఆదాయ నష్టాలు, ఖర్చులు పెరగవచ్చు. ఐటీ సెక్టార్ భారత జీడీపీకి 7-8% సహకరిస్తుంది. అమెరికా ఎగుమతులు తగ్గితే, రూపాయి విలువ మరింత క్షీణించవచ్చు, దీనివల్ల దిగుమతి ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం పెరగవచ్చు.
- శ్యామ్ వేలూరి,
సీనియర్ జర్నలిస్ట్