వైద్యారోగ్య శాఖలో ప్రమోషన్లు.. 36 మందికి సివిల్ సర్జన్లుగా పదోన్నతి

వైద్యారోగ్య శాఖలో ప్రమోషన్లు.. 36 మందికి సివిల్ సర్జన్లుగా పదోన్నతి

హైదరాబాద్, వెలుగు: వైద్య, ఆరోగ్య శాఖలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ల ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డిప్యూటీ సివిల్ సర్జన్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు సివిల్ సర్జన్ (జనరల్ లైన్)లుగా తాత్కాలిక ప్రమోషన్లు కల్పిస్తూ హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ  మంగళవారం జీవో జారీ చేశారు. డాక్టర్ మొహమ్మద్ ఇబ్రహీం (సివిల్ సర్జన్ ఆర్ఎంవో, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి), డాక్టర్ ముడితి వసంత రావు (డీఎంహెచ్​ఓ, సంగారెడ్డి), డాక్టర్ డి. 

రామారావు  (డీఎంహెచ్​ఓ, ఖమ్మం) తదితరులకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో కొత్త పోస్టింగులు కేటాయించారు. ప్రమోషన్ పొందిన వారు 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని, ఈ ప్రమోషన్లు కోర్టు కేసుల తుది తీర్పులకు లోబడి ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులలో స్పష్టం చేసింది. 

ముగ్గురు డిప్యూటీలకు జేడీలుగా... 

ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లకు (అడ్మినిస్ట్రేషన్) జాయింట్ డైరెక్టర్లుగా (అడ్మినిస్ట్రేషన్) తాత్కాలిక ప్రమోషన్ ఇస్తూ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ జీవో జారీ చేశారు. 2024–-25 ప్యానెల్ ఇయర్ కు గాను ఈ ప్రమోషన్లను మంజూరు చేశారు. ప్రమోషన్ పొందిన వారిలో ఎన్. కృష్ణవేణిని జాయింట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం, శ్వేతా మొంగాను జాయింట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్​మెంట్ బోర్డు కార్యాలయంలో, బి. మంజునాథ్ నాయక్‌‌ ను చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐవో), నేషనల్ హెల్త్ మిషన్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులు తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.