- బండారి, మర్రి, వెదురు, బూరుగ, వేప, ఇప్ప, కస్తు వంటి 12 రకాల చెట్లు..
- ప్రదక్షిణ ప్రాంతం చుట్టూ 140 రకాల ఆయుర్వేద మొక్కల పెంపకానికి ఏర్పాట్లు
- ఇప్పటికిప్పుడు పెంచే పరిస్థితి లేకపోవడంతో.. చెట్లనే తీసుకొచ్చేందుకు ప్లాన్
- మరో 10 రోజుల్లో నాటేలా ప్రణాళికలు
వరంగల్/ములుగు/తాడ్వాయి, వెలుగు : మేడారం అభివృద్ధిలో భాగంగా ఓ వైపు గ్రానైట్ శిలలపై కోయ వంశీకుల గొట్టు గోత్రాలు, దైవాలు, జీవన శైలి తెలిపే చిత్రాలను చెక్కుతుండగా.. మరో వైపు గద్దెల చుట్టూ ఉన్న ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా... సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గొట్టు గోత్రాలకు ప్రతిరూపంగా ఉండే చెట్లతో పాటు కోయ వంశీయులు పూజించే చెట్లను గద్దెల చుట్టూ నాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అంతేకాకుండా.. భక్తులు ప్రదక్షిణలు చేసే ప్రాంతం చుట్టూరా వనమూలికలతో కూడిన ఆయుర్వేద మొక్కలు నాటేలా చర్యలు చేపట్టారు. అయితే.. ఇప్పటికిప్పుడు మొక్కలను తీసుకొచ్చి వాటిని పెంచే పరిస్థితులు లేకపోవడంతో ఆదివాసీ మూలాలున్న వివిధ ప్రాంతాల నుంచి చెట్లనే డైరెక్ట్‌గా తీసుకొచ్చి మేడారంలో నాటేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ పనులు పూర్తి చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి అయితే మేడారం పరిసరాలు పూర్తిగా పచ్చదనంతో నిండిపోనున్నాయి.
గద్దెల చుట్టూ 12 రకాల చెట్లు
మేడారం కోయ వంశీకుల్లో 3, 4, 5, 6, 7 గొట్టు గోత్రాలు కలిగిన వారిని ప్రధానంగా చెబుతారు. సమ్మక్క తల్లిది ఐదవ గొట్టు, రాయి బండాని వంశం కాగా.. సారలమ్మ కుటుంబానిది మూడో గొట్టు. నాలుగో గొట్టులో నాగులమ్మ రాయి బండాని వంశం, పగిడిద్దరాజు, గోవిందరాజులు మూలాలు ఉండగా, ఆరో గొట్టులో బేరం బోయినరాజు (పశుపతి) వంశస్తులు, ఏడో గొట్టులో గట్టు పారేడు వంశస్తులు ఉన్నారు. ఈ క్రమంలో గద్దెల ప్రాంతంలో వీరి గోత్రాలతో పాటు వీరు దైవంగా పూజించే 12 రకాల చెట్లను నాటనున్నారు.
సమ్మక్క గద్దె వద్ద ఇప్పటికే నార, రావి చెట్టు ఉండగా.. వారి వంశస్తులు పూజించిన బండాని, మర్రి, మారేడు, వెదురు (కంక చెట్టు), వేప, ఇప్ప చెట్లను నాటేలా ఏర్పాట్లు చేశారు. సారలమ్మ గోత్రానికి సంబంధించిన క్రమంలో బూరుగు చెట్టు ప్రధానం. దీని కిందనే అప్పట్లో పగిడిద్దరాజు, నాగులమ్మ వివాహం జరిగినట్లు కోయ చరిత్ర తెలుపుతోంది. ఇవేగాక వీరి కాలంలో ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా కాలం ఎలా ఉంటుందో తెలిపిన కస్తు చెట్టుతో పాటు తునికి, రేలా వంటి 12 రకాల చెట్లను కోయ వంశీకుల చరిత్రకు అనుగుణంగా, పూజరుల నిర్ణయంతో గద్దెల వద్ద నాటేందుకు సిద్ధమవుతున్నారు.
గద్దెల వద్ద ఉన్నచెట్లు తీయొద్దన్న సీఎం
మేడారం అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో ప్రాంగణం లోపలి వైపున్న ఉన్న చెట్ల కారణంగా కొంత ఇబ్బంది కలుగుతోంది. అయినప్పటికీ.. సమ్మక్క సారలమ్మ తల్లులకు ప్రతిరూపంగా భావించే రావి, మర్రి, జువ్వి, రేలా, వేప వంటి చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకూడదని సీఎం రేవంత్‍రెడ్డి ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. పూజరులు సలహాలు, సూచనలకు అనుగుణంగా ఆ చెట్లను సంరక్షించాలని చెప్పారు. దీంతో గద్దెల ప్రాంగణంలోని ఏండ్ల కిందటి చెట్లను తొలగించకుండానే పనులు చేపడుతున్నారు.
బయటివైపు.. 140 రకాల ఆయుర్వేద చెట్లు
మేడారం అమ్మవార్ల గద్దెల బయటి ప్రాంతంలో సైతం ఔషధ గుణాలు ఉండే 140 చెట్లను నాటేందుకు ప్లాన్ చేశారు. ఇందులో ప్రధానంగా తులసి, వేప, అశ్వగంధ, ఉసిరి, మర్రి, తిప్పతీగ, నాగజెముడుతో పాటు చిల్ల, ముష్టి జాతివంటి మొక్కలు ఉండేలా చూస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో మేడారం జాతర ప్రధాన ప్రాంతం వనంలా కనిపించనుంది.
