హైదరాబాద్ ను ఫిన్టెక్ గ్లోబల్ హబ్ గా మారుస్తం

హైదరాబాద్ ను ఫిన్టెక్ గ్లోబల్ హబ్ గా మారుస్తం
  • డూయిష్​ బోర్స్​ జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు.. రాష్ట్రంలో గ్లోబల్​ ఇన్నోవేషన్ ​హబ్​ ఏర్పాటు చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ను గ్లోబల్  ఫైనాన్షియల్  టెక్నాలజీ (ఫిన్ టెక్) కి అత్యంత కీలకమైన గ్లోబల్  కమాండ్ సెంటర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ దిగ్గజ ఫైనాన్షియల్  మార్కెట్ సంస్థ డూయిష్  బోర్స్  గ్రూప్  గ్లోబల్  కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ను మంగళవారం రాయదుర్గంలో మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పిల్లర్ గా ఉన్న డూయిష్  బోర్స్  గ్రూప్  హైదరాబాద్​ను ఎంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, స్థిరత్వం, ఇక్కడి టాలెంట్ పూల్‌‌పై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. నగరాన్ని ఇంక్యుబేషన్  హబ్‌‌గా మాత్రమే కాకుండా గ్లోబల్  ఆవిష్కరణల పవర్‌‌హౌస్‌‌ గా మార్చేలా ఒక ప్రత్యేక గ్లోబల్  ఇన్నోవేషన్  హబ్‌‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. రీసర్చ్, బ్రేక్‌‌త్రూ ఐడియాలకు ఆ హబ్  ప్లాట్‌‌ఫాంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జర్మనీ కాన్సుల్  జనరల్  మైకేల్  హాస్పర్, స్పెషల్  సీఎస్  సంజయ్ కుమార్, డ్యూయిష్  బోర్స్  సీఓఓ డాక్టర్  క్రిస్టోఫ్ బాం, డైరెక్టర్  డాక్టర్  లుడ్విగ్ హీన్సెల్‌‌మన్  తదితరులు పాల్గొన్నారు.

జీనోమ్ వ్యాలీని సందర్శించండి

ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని క్యూబా రాయబారి జువాన్​ కార్లోస్​ మార్సన్​ అగులేరాకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. కార్లోస్​తో పాటు క్యూబా ఫస్ట్​ సెక్రటరీ మిక్కీ డియాజ్​ పెరెజ్​తో మంగళవారం మంత్రి భేటీ అయ్యారు. బయోటెక్నాలజీ, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, ఏఐ, ఇన్నోవేషన్, అగ్రికల్చర్, సస్టైనబుల్ ఫార్మింగ్  తదితర అంశాల్లో ద్వైపాక్షిక సమకారం, నైపుణ్య మార్పిడిపై చర్చించారు.

 ప్రపంచంలోని టాప్- 7 లైఫ్ సైన్సెస్  క్లస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘జీనోమ్ వ్యాలీ’ ని సందర్శించాలని క్యూబా ప్రతినిధులను ఆహ్వానించారు. కాగా.. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​లో ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ ఆర్టిఫిషియల్​ ఇన్నొవేషన్​ హబ్​ను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్​ బాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.