న్యూఢిల్లీ: భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలు బలమైనవని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ అన్నారు. భారత్‌ను ప్రపంచ సూపర్ పవర్‌గా ఆయన అభివర్ణించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్య చర్చల్లో భాగంగా మనదేశానికి వచ్చిన గిడియన్.. మంగళవారం (నవంబర్ 05) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఏడాది ఇండియాలో జరిగే ఏఐ సదస్సులో ఇజ్రాయెల్ పాల్గొంటుందని కన్ఫామ్ చేశారు. రక్షణ, వ్యవసాయం, ఆర్థిక రంగాల్లో మరింత ముందుకు సాగుతామన్నారు. వాణిజ్య మార్గాన్ని సులభతరం చేయాలని 2023లో జరిగిన జీ 20 సదస్సులో ప్రకటించిన ఇండియా -మిడిల్ ఈస్ట్- యూరప్ కారిడార్ (ఐఎంఈసీ)ను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్,-ఇజ్రాయెల్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు, భారత కార్మికుల రాకపోకలను పెంచాలని గిడియన్ కోరారు.
