- రాష్ట్ర సర్కార్‌కు కృతజ్ఞతలు తెలిపిన జూడాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల బలోపేతానికి, నాణ్యమైన మెడికల్ విద్యను అందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జూనియర్ డాక్టర్లు (జూడా) అభినందించారు. ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు పెంచడం, టీచింగ్ ఫ్యాకల్టీ నియామకం, జూనియర్ డాక్టర్లు సీనియర్ రెసిడెంట్లకు స్టైపండ్ 15 శాతం పెంచిన విషయాలను వారు గుర్తుచేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో కాలేజీల్లో సౌకర్యాలు పెరిగాయని, దీంతో ఇటీవల జరిగిన అసెస్‌మెంట్‌లో ఒక్క సీటును కూడా నేషనల్ మెడికల్ కమిషన్ తగ్గించలేదన్నారు.
కాలేజీల అభివృద్ధితో పీజీ, యూజీ సీట్లు అదనంగా వచ్చాయని, దీంతో తమకు అవకాశాలు పెరిగాయని డాక్టర్లు వివరించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని జూడాలు తెలిపారు.
హెల్త్ మినిస్టర్‌కు కృతజ్ఞతలు..
హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐజాక్, జనరల్ సెక్రటరీ అజయ్ నేతృత్వంలోని జూనియర్ డాక్టర్ల బృందం, మంగళవారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని జూడాలు సంతోషం వ్యక్తం చేశారు.
తమ దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డికి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో స్థానిక డాక్టర్లకు పీజీ సీట్లు పొందే అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని జూడాలు తెలిపారు.
