
హైదరాబాద్: నిన్నమొన్నటి వరకూ ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు బ్రేక్ పడింది. వారం నుంచి పది రోజులు పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు కనిపించడం లేదని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలకు బ్రేక్ పడనుంది. ఎండ తీవ్రత మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేయడం గమనార్హం. అయితే.. ఎండల వల్ల క్యూమిలోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలో అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టాయి. రెండు మూడు రోజులుగా కురిసిన భారీ, అతి భారీ వర్షాలతో దాదాపు లోటు వర్షపాతమంతా కవర్ అయిపోయింది. బుధవారం రాత్రి (23-07-2025) పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కుమ్రం భీం జిల్లా బెజ్జూరులో 23.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
ములుగు జిల్లా వెంకటాపురంలో 21.9 సెంటీ మీటర్లు, కరీంనగర్ జిల్లా పోచంపల్లిలో 14.5, కరీంనగర్లో 12.6, ములుగు జిల్లా మంగపేటలో 12.5, మల్లంపల్లిలో 11.9, కరీంనగర్ జిల్లా మంగిపల్లిలో 11.6, హనుమకొండ జిల్లా మరిపల్లిగూడెంలో 11.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా పరీవాహకంలో వరదలు కొనసాగుతున్నాయి. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్తో పాటు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు కూడా నిండిపోయాయి.