
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తిని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ దంపతులు సందర్శించుకున్నారు. శనివారం రాత్రి మధ్యప్రదేశ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం దంపతులకు ఎంపీపీ జయమ్మ భర్త దిద్యాల శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ముచ్చింతల్‌కు వెళ్లి, సమతా మూర్తిని దర్శించుకున్నారు.
రామానుజుల విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత 108 దివ్య ఆలయాలను దర్శించుకున్న సీఎం దంపతులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చిన్నజీయర్ స్వామిని కలిసి మోహన్ యాదవ్‌ను ఆయన శాలువాతో సన్మానించి, రామానుజుల విగ్రహాన్ని అందజేశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సుందరమైన తీర్థ క్షేత్రాన్ని తాను ఎక్కడా చూడలేదన్నారు. సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి రామానుజాచార్యులని, ఆయన అడుగుజాడల్లోనే నేటి యువత నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.