కర్నల్‌‌ సోఫియాపై కామెంట్లు.. మధ్యప్రదేశ్ మంత్రిపై కేసు

కర్నల్‌‌ సోఫియాపై కామెంట్లు.. మధ్యప్రదేశ్ మంత్రిపై కేసు
  • హైకోర్టు ఆదేశాలతో ఎఫ్‌‌ఐఆర్

భోపాల్: కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సుమోటోగా విచారణ చేపట్టిన కోర్టు.. ఆయనపై కేసు నమోదు చేయాలని డీజీపీకి బుధవారం ఆదేశాలిచ్చింది. మన ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించారు. 

అయితే మంగళవారం ఓ కార్యక్రమంలో మంత్రి విజయ్ షా మాట్లాడుతూ.. ‘‘వాళ్లు (ఉగ్రవాదులు) మన అక్కాచెల్లెళ్లు, ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేస్తే.. మనం వాళ్ల సొంత సిస్టర్ (సోఫియా ఖురేషీ)ను పంపించి వాళ్లకు గుణపాఠం చెప్పాం” అని అన్నారు. మతం కోణంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. విజయ్ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  దీంతో విజయ్ షా చివరికి క్షమాపణలు చెప్పారు.