దర్గా దగ్గర దీపం వెలిగించొచ్చు.. ఆ స్థలం ఆలయానిదే.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు..

దర్గా దగ్గర దీపం వెలిగించొచ్చు.. ఆ స్థలం ఆలయానిదే.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు..

మధురైలోని తిరుపరకుండ్రం కొండపై ఉన్న దర్గా సమీపంలో దీపం (దీపథూన్) వెలిగించే విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అక్కడ దీపం వెలిగించడానికి అనుమతిస్తూ గతంలో ఒక జడ్జి ఇచ్చిన తీర్పును, ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ సమర్థించింది. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

కొండపై ఉన్న ఆ రాతి స్తంభం (దీపథూన్) ఉన్న ప్రాంతం ఖచ్చితంగా సుబ్రమణ్య స్వామి ఆలయానికే చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది. శాంతిభద్రతల సమస్యలు వస్తాయని చెప్పి ఆచారాలను ఆపకూడదని, సమస్యలు రాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. కొండ రక్షిత ప్రాంతం కాబట్టి, భారత పురావస్తు శాఖ (ASI) అధికారులతో చర్చించి, ఎంతమంది వెళ్లి దీపం వెలిగించాలో నిర్ణయించాలని సూచించింది.

అసలు వివాదం ఏంటంటే ?
తిరుపరకుండ్రం కొండ మురుగన్ భక్తులకు అత్యంత పవిత్రమైనది. అక్కడ ఒక దర్గా కూడా ఉంది. 1920 నుంచే ఈ కొండ యాజమాన్యంపై వివాదాలు ఉన్నాయి. అప్పట్లోనే కోర్టులు కొండ అంతా ఆలయానిదేనని, కొన్ని భాగాలు మాత్రమే దర్గాకు చెందుతాయని తీర్పునిచ్చాయి.

1994లో ఒక భక్తుడు దర్గాకు దగ్గరగా ఉండే పాత రాతి స్తంభం దగ్గర దీపం వెలిగించాలని కోరడంతో ఈ వివాదం మళ్లీ మొదలైంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అక్కడ దీపం వెలిగించే మార్గం క్లియర్ అయింది. ఈ తీర్పును హిందూ సంఘాలు, మురుగన్ భక్తులు అంగీకరించాయి. ఇది భక్తుల విజయమని, ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డంకులు సృష్టించకుండా ఆలయ అధికారుల ద్వారా దీపం వెలిగించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.