బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత నామినేషన్.. జూబ్లీహిల్స్ బైపోల్కు మూడో రోజు 12 మంది నామినేషన్లు

బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత నామినేషన్.. జూబ్లీహిల్స్ బైపోల్కు మూడో రోజు 12 మంది నామినేషన్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మూడో రోజు బుధవారం 12 మంది 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. షేక్ పేట్ లోని ఆర్వో కార్యాలయంలో ఆర్వో సాయిరాం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు సల్మాన్ ఖాన్, చిలక చంద్రశేఖర్ నామినేషన్లు వేశారు. వారు మొదటి రోజు సోమవారం ఒక సెట్ నామినేషన్ వేయగా.. బుధవారం ఇద్దరు మరో నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత రెండు సెట్ల నామినేషన్లు వేశారు.

 ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి ఒక సెట్ వేయగా.. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ తో పాటు కార్పొరేటర్లతో కలిసి మరో నామినేషన్ దాఖలు చేశారు. ఇక  మిగతా 9 మందిలో ఇద్దరు రిజిస్టర్ పార్టీ నుంచి నామినేషన్లు వేశారు. మిగతా 7 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. పార్టీ నుంచి వేసిన వారిలో ప్రజా వెలుగు పార్టీ  నుంచి ప్రవీణ్ కుమార్ అర్రోళ్ల, అలయన్స్ ఆఫ్ డిమోక్రటిక్ రిఫార్మ్ స్ పార్టీ నుంచి బుద్ధయ్య అంబోజులు నామినేషన్ దాఖలు చేశారు. మూడు రోజుల్లో మొత్తం 30  మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు వేశారు. ఈ నెల 21 వరకు నామినేషన్లకు అవకాశముంది.