మ్యాజిక్ బాక్స్ చీటింగ్ : ఈ బాక్సులో డబ్బులు పెడితే.. డబ్బులు పిల్లలను పెడతాయంట..!

మ్యాజిక్ బాక్స్ చీటింగ్ : ఈ బాక్సులో డబ్బులు పెడితే.. డబ్బులు పిల్లలను పెడతాయంట..!

ఎక్కడైనా డబ్బులు ఎలా పుడతాయి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తే.. వారు రిలీజ్ చేస్తే బయటకు వస్తాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాగే జరుగుతుంది. అంతేకానీ మ్యాజిక్ బాక్సులో డబ్బులు పెడితే.. ఎక్కడైనా డబ్బులు పిల్లలను పెడతాయా.. అస్సలు పెట్టవు.. వీళ్లు మాత్రం డబ్బులు పిల్లలను పెడతాయని.. ఈ బాక్సులో డబ్బులను పెడితే.. డబుల్ అవుతాయంటూ చెబుతున్నారు. వీళ్లు చెప్పటం ఏమోకానీ.. వీళ్లు చెప్పింది నమ్ముతున్న వాళ్లు కూడా ఉండటం వింతలో విడ్డూరం.. 

ఓ పెట్టెను చూపించి మామూలు పెట్టెకాదు.. ఆకాశం నుంచి ఊడిపడింది.. దాన్ని ముట్టుకుంటే వైబ్రేట్ అవుతుంది.. మహిమళు గల పెట్టె అది. అది ఎవరి దగ్గర ఉంటే.. వారు ధనవంతులు అవుతారు. ఊహించనంత ధనం వారికి వచ్చి చేరుకుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చు. ఇలాంటి తీపి మాయమాటలు చెబుతూ ఓ ముఠా భారీ మోసానికి తెర తీసింది. ఒకటి కాదు రెండు కాదు ఎకంగా రూ. 50 కోట్లు లేపేద్దామని బేరం కుదుర్చుకుని అమ్మే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు చిక్కి జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.  

వివరాల్లోకి వెళితే.. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మున్ననూరు గ్రామానికి చెందిన కేతావత్‌ శంకర్‌, వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన మహమ్మద్‌ అజార్‌, నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం సంఘం బండ గ్రామానికి చెందిన ఖాసీం, నల్లగొండ జిల్లా డిండి మండలం దేవత్‌పల్లి తండాకు చెందిన కొర్ర సాసిరాం హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తున్నారు. ఈ నలుగురు కలిసి ఈజీగా డబ్బు సంపాదించాలని ఓ ప్లాన్ వేసి బుక్ అయ్యారు. ఇంతకు ఏంటా ప్లాన్ అంటే ఆకాశం నుంచి కిందపడిన ఓ పెట్టె తమకు దొరికిందని.. దానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని.. అది ఎవరి దగ్గర ఉంటే వారు ఐశ్వర్యవంతులవుతారని చాలా మందిని నమ్మించారు. 

ఆ పెట్టెకు రూ.50 కోట్ల ధర నిర్ణయించి.. వరంగల్‌లో ఓ వ్యక్తికి అమ్మేందుకు స్కెచ్ వేశారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి నలుగురు కలిసి ఆ పెట్టెను పట్టుకుని ఆటోలో బయల్దేరారు. ఈ క్రమంలో వరంగల్ హైవే పై పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారిని చేజ్ చేసి పట్టుకున్నారు. పోలీసులకు వారిపై అనుమానం వచ్చి విచారించారు. దీంతో వారి అసలు రంగు బయటపడింది. ఒక పెట్టెను కొని దానికి ఎలక్ట్రానిక్ డివైస్ అమర్చి  పెట్టెపై అయస్కాంతం పెడితే వైబ్రేషన్ వచ్చేట్టు చేసి పిడుగు పడ్డప్పుడు వచ్చే మెటల్తో తయారు చేశామని.. దానికి మహిమలు ఉన్నాయని ఆ పెట్టె ఎవరి దగ్గర ఉంటే వాళ్లు ధనవంతులవుతారని పలువురిని నమ్మించి మోసం చేశారని పోలీసులు చెప్పారు. 

దాని ధర రూ.50 కోట్లు ఉంటుందని చెప్పి రూ.5 నుంచి 10 లక్షల వరకు బేరం కుదుర్చుకుని అమాయకుల దగ్గర నుంచి రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు అడ్వాన్స్ తీసుకుని ఉడాయించేవారని తెలిపారు. ఇలా ఇప్పటి వరకు సుమారు రూ.20 లక్షలు వసూలు చేశారని విచారణలో తెలిసిందన్నారు. తాజాగా వరంగల్‌లో ఓ వ్యక్తికి పెట్టను అమ్మేందుకు ప్రయత్నించగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. వారి నుంచి మంత్రపు పెట్టె, నాలుగు మొబైల్​ ఫోన్స్​, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని ఏసీపీ వెల్లడించారు.