Pankaj Dheer: మహాభారత్ కర్ణుడు.. నటుడు పంకజ్ ధీర్ మృతి

Pankaj Dheer: మహాభారత్ కర్ణుడు.. నటుడు పంకజ్ ధీర్ మృతి

మహాభారత్​ ఫేమ్​.. ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ (68) కన్నుమూశారు. గతకొంత కాలంగా క్యాన్సర్​తో  బాధపడుతున్న పంకజ్​.. బుధవారం( 2025 అక్టోబర్​15) తుది శ్వాస విడిచారు. సక్సెస్​ ఫుల్​ఎపిక్​ పీరియాడికల్ డ్రామా షో మహాభారతంలో 'కర్ణ' పాత్ర పోషించి ప్రసిద్ధి చెందారు పంకజ్. 

తన నటనా జీవితంలో పంకజ్ ధీర్ అనేక టెలివిజన్ కార్యక్రమాలు ,సినిమాలు రెండింటిలోనూ నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. పంకజ్​ నటించిన బిఆర్ చోప్రా 'మహాభారత్', 'సద్దా ముఖద్దర్', 'ఇక్కే పే ఇక్కా'తో పాటుగా.. 'చంద్రకాంత', 'ది గ్రేట్ మరాఠా', 'యుగ్' మరియు 'బధో బహు', ససురల్ సిమర్ కా వంటి వాటిలో ఇతర పాత్రలకు గానూ ఆయన ప్రసిద్ధి చెందారు. అలాగే, సడక్ సోల్జర్ మరియు బాద్‌షా వంటి అనేక హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. 

నటుడు అర్జున్ ఫిరోజ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో నటుడు పంకజ్ ధీర్ మృతి పట్ల తన బాధను వ్యక్తం చేశారు. ‘జెంటిల్‌మన్ వీడ్కోలు.. మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ’ ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ బుల్లితెరతో పాటుగా వెండితెర ప్రముఖులు సైతం పంకజ్ మరణ వార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 

నటుడు పంకజ్ గురించి:

పంకజ్ ధీర్ 1956 నవంబర్‌ 9న పంజాబ్‌లో జన్మించారు.1980 ప్రారంభంలో తన నటనా జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో సీరియల్స్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ, సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు పొందారు.

పంకజ్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. అనితా ధీర్‌ను పంకజ్ వివాహం చేసుకున్నాడు. వీరికి నికితిన్ ధీర్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతను కూడా నటనలో రాణిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన కుమారుడు నికితిన్.. సీరియల్ నటి క్రతికా సెంగర్‌ను మ్యారేజ్ చేసుకున్నారు.