- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు స్కెచ్
- మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లోని ..
- పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య చర్చలు
- క్యాండిడేట్ వీక్‌గా ఉన్న ప్రాంతాల్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని అగ్రిమెంట్
మహబూబ్‌నగర్, వెలుగు:అధికార కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైనట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే ఒకరికొకరు సహకరించుకొని.. మెజార్టీ కౌన్సిలర్, చైర్పర్సన్ పీఠాలను దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఈక్రమంలో ఇటీవల ఈ రెండు పార్టీలకు చెందిన పలువురు నియోజకవర్గాల లీడర్లు తమ ఫామ్ హౌస్‌లలో చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ చర్చల్లో ఆయా మున్సిపాల్టీల్లో పోటీలో ఉన్న క్యాండిడేట్లు, ఈ రెండు పార్టీలకు చెందిన క్యాడర్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే అధికార పార్టీపై గుర్రుగా ఉన్న కొందరు లీడర్లు కాంగ్రెస్ క్యాండిడేట్లను ఓడించేందుకు ఫండింగ్ కూడా చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా నారాయణపేట జిల్లాలోని కొందరు లీడర్లు ఆయా స్థానాల్లో అధికార పార్టీ క్యాండిడేట్లను ఓడించేందుకు ఈ రెండు పార్టీల క్యాండిడేట్ల కోసం కొంత ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
చైర్మన్ పీఠం కోసం ఒప్పందాలు..
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీని చేజక్కించుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైనట్లు సమాచారం. ఈ మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్‌కు రిజర్వ్ కాగా, 16 వార్డులు ఉన్నాయి. 9 కౌన్సిలర్ స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటే ఆ పార్టీకి చైర్మన్ పదవి దక్కుతుంది. దీంతో బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఐదు నుంచి ఆరు కౌన్సిలర్ స్థానాలు గెలిచి, బీజేపీ మూడు నుంచి నాలుగు స్థానాల్లో గెలిస్తే, బీజేపీ మద్దతుతో చైర్మన్ పదవిని బీఆర్ఎస్ దక్కించుకొని, వైస్ చైర్మన్ పదవి బీజేపీకి ఇచ్చేలా చర్చలు జరిగినట్లు సమాచారం.
ఒక వేళ బీజేపీ ఐదు నుంచి ఆరు స్థానాల్లో గెలిచి, బీఆర్ఎస్ మూడు నుంచి నాలుగు స్థానాల్లో గెలిస్తే బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో బీజేపీ చైర్మన్ పీఠాన్ని, వైస్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొనడం ఈ ఒప్పందాలకు బలం చేకూరుస్తోంది.
దేవరకద్ర, భూత్పూర్లోనూ..
దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా, బీసీ ఉమెన్ కు రిజర్వ్ అయింది. కొద్ది రోజుల కింద ఓ బీజేపీ లీడర్ సమక్షంలో బీఆర్ఎస్ లీడర్లు సమావేశం అయ్యారు. ఈ రెండు పార్టీల క్యాండిడేట్లు ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నారో? అక్కడ ఒకరికొకరు సహకరించుకొని కౌన్సిలర్ స్థానాలకు దక్కించుకోవాలని చర్చించుకున్నట్లు తెలిసింది.
ఎన్నికలు పూర్తయ్యాక మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను ఎవరు దక్కించుకుంటే వారు చైర్మన్ పదవిని తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ రెండు పార్టీలకు చెందిన క్యాండిడేట్లను ఒకే తాటిపైకి తీసుకురాడానికి గతంలో కాంగ్రెస్‌లోనే పని చేసిన ఓ ముఖ్య లీడర్ కీ రోల్ పోషించినట్లు సమాచారం. అలాగే భూత్పూర్ మున్సిపాలిటీని సైతం దక్కించుకునేందుకు ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందాలు జరిగినట్లు తెలిసింది.
కార్పొరేషన్లో భిన్న పరిస్థితి..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో భిన్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ అధికార పార్టీ నుంచే ఆ పార్టీ క్యాండిడేట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏండ్లుగా పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా పలు డివిజన్ల నుంచి కొత్తగా పార్టీలో చేరిన వారికి బీఫాంలు ఇచ్చారు. మరికొన్ని డివిజన్లలో సిట్టింగ్ కౌన్సిలర్లను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పించారు.
దీంతో వారిలో కొందరు పార్టీ నుంచి బీఫాం రాలేదని నామినేషన్లు విత్ డ్రా చేసుకోకుండా ఇండిపెండెంట్లుగానే బరిలో ఉన్నారు. మరికొందరు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నా.. అంతర్గతంగా వేరే పార్టీ క్యాండిడేట్లకు సపోర్ట్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీనికితోడు సొంత పార్టీ నుంచే తమను ఓడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్వయంగా పలువురు క్యాండిడేట్లు బహిరంగంగానే చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
