మహబూబ్ నగర్ లో సరస్ మేళా సూపర్..ఆకట్టుకున్న మహిళా సంఘాల స్టాళ్లు

మహబూబ్ నగర్ లో సరస్ మేళా సూపర్..ఆకట్టుకున్న మహిళా సంఘాల స్టాళ్లు
  •     29 వరకూ ఎగ్జిబిషన్​ 

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు :  జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 'మినీ సరస్​ మేళా' ను సోమవారం కలెక్టర్​ ఖుష్బూ గుప్తా ప్రారంభించారు.  ఉమ్మడి పాలమూరు జిల్లాకు  చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు   తయారు చేసిన వస్తువులను  స్టాల్స్​లో పెట్టారు.  ఈ నెల 29వ  వరకు ఎగ్జిబిషన్​ ఉండనుంది. ఈసందర్భంగా  కలెక్టర్​ పలు స్టాళ్లను సందర్శించి  ఉత్పత్తులను పరిశీలించారు. మార్కెటింగ్ విధానాలు, ఆదాయం తదితర అంశాల గురించి  తెలుసుకున్నారు.

కాగా.. మినీ సరస్ మేళాలో స్వయం సహాయక సంఘాల స్టాళ్లతో పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'భరోసా', వైద్య ఆరోగ్య శాఖ హెల్త్  క్యాంప్, బీసీ సంక్షేమ శాఖ, ఎస్‌బీఐ బ్యాంక్ స్టాళ్లు ఏర్పాటు చేసి, వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడారు.  స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులను కొని,  వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.  డీఆర్​డీఏ, నగర పాలక సంస్థ, ఇతర శాఖల అధికారులను కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్​ సూచించారు.

ఆర్గానిక్​ పంటలను ప్రోత్పహించాలి

ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయల సాగు చేస్తున్నాం. తుల్జా భవాని స్టాల్​ను ఏర్పాటు చేసి ఆర్గానిక్ కూరగాయలు, గానుగ నూనెల తయారు చేసి అమ్ముకొని ఉపాధి పొందుతున్నాం. ప్రభుత్వం ఆర్గానిక్ పంటలకు మరింత ప్రోత్సాహం అందించాలి.

- హర్యానాయక్, సరోజ దంపతులు, చేదుగుట్టతండా, మిడ్జిడల్ మండలం-

సొంతంగా తయారీ

సొంత నిధులతో గిరిజనులకు సంబంధించిన   డ్రెస్సులు, ఆభరణాలను తయారు చేస్తున్నాం. షాపును ఏర్పాటు చేసి వాటిని అమ్ముతున్నాం. రాజస్థాన్, హైదరాబాద్ నుంచి మెటీరియల్​ను దిగుమతి చేసుకుంటున్నాం. ఇలాంటి దుకాణాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలి.   

- శ్రావణి, ఆర్​సీ తండా, జడ్చర్ల మండలం-