మహబూబాబాద్ లో పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి : శశాంక

మహబూబాబాద్ లో పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి : శశాంక

మహబూబాబాద్/మరిపెడ, వెలుగు : పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్‌‌లో శనివారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కేసముద్రం మార్కెట్‌‌ పరిధిలో మూడు, తొర్రూరులో రెండు, మహబూబాబాద్‌‌ పరిధిలో ఒక జిన్నింగ్‌‌ మిల్‌‌ ఉందని, వీటిలో పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ సంవత్సరంలో 82,580 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 5,77,988.32 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. మొదటి రకం పత్తి రేటు రూ. 7,020కి, సెకండ్‌‌ గ్రేడ్‌‌ రేటును రూ. 6,620లకు పెంచినట్లు చెప్పారు. పత్తిని అమ్మే రైతులు తమ బ్యాంక్‌‌ అకౌంట్‌‌కు ఆధార్‌‌ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. నవంబర్‌‌లో ప్రారంభం కానున్న కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని సూచించారు.

రివ్యూలో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ డేవిడ్‌‌, ఏఎస్పీ చెన్నయ్య, జేడీఏ ఛత్రునాయక్‌‌, మార్కెటింగ్‌‌ అధికారి వెంకట్‌‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మరిపెడ మండలం ఎడ్చర్లలో నిర్వహించిన మానుకోట రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌‌ వార్షిక సర్వసభ్య సమావేశానికి కలెక్టర్‌‌ హాజరయ్యారు.