ఆఫీసర్లు అలర్ట్‌‌గా ఉండాలి : కలెక్టర్‌‌ శశాంక

ఆఫీసర్లు అలర్ట్‌‌గా ఉండాలి : కలెక్టర్‌‌ శశాంక

మహబూబాబాద్, వెలుగు : తుఫాన్‌‌ ప్రభావంతో రెండు రోజులుగా వర్షాలు పడుతున్నందున ఆఫీసర్లు అలర్ట్‌‌గా ఉండాలని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ శశాంక ఆదేశించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్‌‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌‌లో ఆఫీసర్లతో మాట్లాడారు. శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్‌‌లలో కొనసాగుతున్న అంగన్‌‌ వాడీ కేంద్రం, స్కూల్స్‌‌ను వెంటనే ఖాళీ చేయించాలని ఆదేశించారు. విద్యుత్‌‌ ప్రమాదాలు జరగకుండా సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండాలన్నారు. చెరువుల వద్ద భద్రత కోసం ఇసుకతో నింపిన బస్తాలు వేయాలని చెప్పారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

వాగుల దగ్గరికి వెళ్లొద్దు

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున వాగులు, వంకలు ఉప్పొంగే ప్రమాదం ఉందని, ప్రజలెవరూ వాగుల వద్దకు వెళ్లొద్దని మహబూబాబాద్‌‌ ఎస్పీ సంగ్రామ్‌‌ సింగ్‌‌ పాటిల్ సూచించారు. గార్ల మండల శివారులోని పాకాల వాగును బుధవారం పరిశీలించి మాట్లాడారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నందున గార్ల మండలం రాంపురం మార్గమధ్యలోని పాకాల ఏరు ఉధృతంగా పారే అవకాశం ఉందన్నారు. ప్రజలెవరూ వాగుల వద్దకు వెళ్లొద్దని చెప్పారు. ఆయన వెంట మహబూబాబాద్‌‌ డీఎస్పీ సత్యనారాయణ, బయ్యారం సీఐ బాబూరావు, గార్ల ఎస్సై వెంకన్న ఉన్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

భూపాలపల్లి అర్బన్‌‌, వెలుగు : తుఫాన్‌‌ నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని భూపాలపల్లి అడిషనల్‌‌ కలెక్టర్‌‌ కె.వెంకటేశ్వర్లు సూచించారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దముత్తారం, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలం ముల్కలపల్లి గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించి మాట్లాడారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడ్ల కొనుగోళ్లను స్పీడప్‌‌ చేయాలని ఆదేశించారు.