మహబూబాబాద్, వెలుగు: వానాకాల సీజన్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలను చేపట్టాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల స్టాక్, సరఫరా, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు, కాలువలు, మిషన్ కాకతీయ పనుల పురోగతి. చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ స్నేహ శబరీశ్మాట్లాడుతూ నేటి నుంచి ప్రారంభమయ్యే వనమహోత్సవంలో ప్రతి గ్రామంలో నర్సరీల ద్వారా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కె.అనిల్ కుమార్, జడ్పీ సీఈవో పురుషోత్తం, ఆర్డీవోలు రాజేశ్వరి, గణేశ్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కేవలం ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
