
- రైతు భరోసాకే ఏటా రూ.21 వేల కోట్లు అవుతాయని అంచనా
- గ్యారంటీలకు నిధులపై ఆర్థిక శాఖ కసరత్తు షురూ
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ఏడాదికి రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఒక్కో గ్యారంటీతో ప్రభుత్వంపై పడే భారం ఎంత అనేదానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. మహాలక్ష్మి స్కీమ్ శనివారం నుంచి అమల్లోకి రానుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇన్సూరెన్స్ పెంపు కూడా అమల్లోకి తెస్తున్నారు. అలాగే ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో దాదాపు రూ.4 వేల కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పథకంలో ఇల్లు లేనివారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలం ఇవ్వనున్నారు.
దీనికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఈసారి రైతులకు, కౌలుదారులకు ‘రైతు భరోసా’ పేరిట పెట్టుబడి సాయం అందించనున్నారు. ఏటా ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల చొప్పున ఇవ్వనున్నారు. ఈ స్కీమ్ కే రూ. 21 వేల కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఒక దఫాకు రూ.10,500 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోపాటు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత,- చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ,- బోదకాలు బాధితులు, డయాలసిస్ చేయించుకుంటున్నవారికి నెలవారీ పింఛన్ రూ. 4 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతినెలా రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు అవుతాయని అంటున్నారు.