మహారాష్ట్రలో భారీ క్రేన్ కూలి 20 మంది దుర్మరణం

మహారాష్ట్రలో భారీ క్రేన్ కూలి 20 మంది దుర్మరణం

సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే పనుల్లో ప్రమాదం 
35 మీటర్ల పైనుంచి పడిన క్రేన్
రాష్ట్రపతి, ప్రధాని, సీఎం షిండే దిగ్ర్భాంతి 


ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. హైవే పనులు చేస్తుండగా భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 35 మీటర్ల ఎత్తు నుంచి 700 టన్నుల బరువున్న క్రేన్ కుప్పకూలడంతో డెడ్ బాడీలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. థానె జిల్లాలో సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే పనులు జరుగుతుండగా, మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ముంబై, నాగపూర్ ను కలుపుతూ 701 కిలోమీటర్ల ఎక్స్ ప్రెస్ వే నిర్మిస్తున్నారు. నాసిక్, థానె మధ్య 101 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి.

 ప్రస్తుతం థానెలోని సర్లాంబే గ్రామంలో పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఉన్నట్టుండి భారీ క్రేన్ కుప్పకూలింది. ‘‘హైవేల నిర్మాణంలో ముందుగానే తయారు చేసిన గడర్ (పెద్ద బీమ్)లను పిల్లర్లపై అమర్చేందుకు భారీ క్రేన్​లను వినియోగిస్తాం. ప్రస్తుతం వర్క్ జరుగుతున్న 2.28 కిలోమీటర్ల వయాడక్ట్ కు సంబంధించి మొత్తం 114 సెగ్మెంట్స్ ఉండగా, అందులో 98 విజయవంతంగా అమర్చినం. కానీ 99వ సెగ్మెంట్ తరలిస్తుండగా దురదృష్టవశాత్తూ క్రేన్ కుప్పకూలింది. 

700 టన్నుల బరువున్న ఆ మెషిన్.. 35 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయింది” అని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తెలిపింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారని.. వారిలో 10 మంది కార్మికులు సహా ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారని చెప్పింది. మరో ముగ్గురు గాయపడ్డారని, వాళ్లు ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారని పేర్కొంది. ఈ రోడ్డు పనులను సింగపూర్ కు చెందిన వీఎస్ఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​తో కలిసి నవయుగ కంపెనీ చేస్తున్నదని పేర్కొంది. కాగా, కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. 


ఎక్స్ పర్ట్స్ తో విచారణ.. 
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం షిండే దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడినోళ్లకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రధాని ప్రకటించారు.