ఉద్ధవ్ తప్పటడుగులేసిన్రు..మేం సరిదిద్దినం : ఏక్​నాథ్​ షిండే

ఉద్ధవ్ తప్పటడుగులేసిన్రు..మేం సరిదిద్దినం : ఏక్​నాథ్​ షిండే

ఉద్ధవ్ తప్పటడుగులేసిన్రు..మేం సరిదిద్దినం

అయోధ్య :  బీజేపీ సిద్ధాంతం, తమ పార్టీ సిద్ధాంతం ఒకటేనని, వచ్చే ఏడాదిలో మహారాష్ట్ర అంతటా కాషాయ జెండా ఎగురవేస్తామని శివసేన నేత, మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ షిండే అన్నారు. గత  జూన్‌‌‌‌‌‌‌‌లో ముఖ్యమంత్రి అయిన తర్వాత షిండే తొలిసారిగా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​తో కలిసి ఆదివారం యూపీలోని అయోధ్యలో పర్యటించారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వేలాది మంది శివసైనికులు అయోధ్యకు చేరుకున్నారు. రామాలయంలో షిండే పూజలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

శివసేన వ్యవస్థాపకుడు బాల్​ థాక్రే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకున్నారని అన్నారు. ఆయన కొడుకు ఉద్ధవ్ థాక్రే మాత్రం అధికారం కోసం తండ్రి ఆలోచనలకు వ్యతిరేకంగా నడుచుకున్నారని ఆరోపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని తాము ఆ తప్పును తాను సరిచేశానని చెప్పారు. అయోధ్యలో రామ మందిరం అంశం కేవలం రాజకీయాలకు సంబంధించింది కాదని, శివసేన పార్టీ విశ్వాసానికి సంబంధించింది కూడా అని షిండే అన్నారు.  యూపీలో లా అండ్ ఆర్డర్ బాగుందని, సీఎం యోగి సర్కారును చూసి పోకిరీలు భయపడుతున్నారని అన్నారు. 

అందుకే విల్లు, బాణం మా దగ్గరుంది

తాను శ్రీరాముడి దర్శనం కోసం వెళ్తున్నానని షిండే అయోధ్యకు బయల్దేరేముందు లక్నోలో మీడియాతో చెప్పారు. ‘మాకు రాముడి ఆశీస్సులు ఉన్నాయి. అందుకే విల్లు, బాణం గుర్తు మాతో ఉంది’ అని అన్నారు.  

రాముడు వాళ్లను క్షమించడు : ఎంవీఏ 

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోకుండా షిండే అయోధ్య పర్యటనకు వెళ్లారని మహా వికాస్ అఘాడి మండిపడింది. ప్రజలను మభ్యపెట్టినందుకు షిండేను, ఫడ్నవీస్​ను రాముడు క్షమించడని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్, ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు.