
మహదేవ్ పూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్మండలంలోని మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైన మహారాష్ట్రలోని భూములకు ఎకరాకు రూ. 3 లక్షలు మాత్రమే ఇస్తామనడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీ కన్స్ట్రక్షన్ కు అవసరమైన భూములను స్వాధీనం చేసుకున్న తెలంగాణ సర్కారు ఆ తర్వాత బ్యాక్ వాటర్ తో ముంపునకు గురవుతున్న సుమారు రెండు వేల ఎకరాలను స్వాధీనం చేసుకోవడంలో వెనుకంజ వేసింది. దీంతో మూడు సంవత్సరాలుగా అటు తెలంగాణ ఇటు మహారాష్ట్ర రెండువైపులా రైతులు బ్యాక్ వాటర్ తో ఇబ్బందులకు గురవుతున్నారు.
మహారాష్ట్ర రైతులు తమకు పరిహారం చెల్లించాలంటూ పలుసార్లు నిరసనలు వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా కేంద్రంలో శుక్రవారం అధికారులు, 12 ముంపు గ్రామాల రైతుల మధ్య చర్చలు జరిగాయి. రైతుల డిమాండ్లకు అనుగుణంగా పరిహారం చెల్లించేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో చర్చలు విఫలం అయ్యాయి. మూడేళ్ల క్రితం సేకరించిన భూమికి ఎకరాకు రూ. 10.5 లక్షలు చెల్లించారని, ఇప్పుడు మాత్రం రూ. 3 లక్షలే ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతులు మండిపడ్డారు. పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు.