కరోనాతో సహజీవనం చేయడం కాదు.. దాన్ని నియంత్రించాలి

కరోనాతో సహజీవనం చేయడం కాదు.. దాన్ని నియంత్రించాలి

సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షడిని చేయడం హర్షణీయం

చంద్రబాబు మమ్మల్ని బ్రేక్ ఫాస్ట్ కు పిలిచి ఉత్తరం ఇచ్చారు

నాయకులు చేతగాక కరోనాతో సహజీవనం చేద్దామంటున్నారు

మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. సంజయ్ సేవలను గుర్తించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. సంజయ్ నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. పార్టీని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మంచి స్థానంలో నిలిపే సత్తా సంజయ్ కు ఉందని ఆయన అన్నారు. చాలా రోజుల తర్వాత కరీంనగర్ కు వచ్చిన ఆయన.. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిసి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరీంనగర్ జిల్లాకు చాలా రోజుల తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కింది. గతంలో నేను కూడా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశాను. నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు 12 ఎమ్మెల్యేలు, ఏడు ఎంపీ స్థానాలు గెలిచాం. రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఇప్పటి వరకు అవే అత్యధిక స్థానాలు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. మమ్మల్ని బ్రేక్ ఫాస్ట్ కు పిలిచి వాజ్ పేయి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని మాకు ఉత్తరం అందించారు. ఆ తర్వాత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం ఏర్పడటంలో కరీంనగర్ జిల్లా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా.. సంజయ్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించబోతుందన్న నమ్మకం నాకుంది.

కరోనాతో సహజీవనం చేయాలనడం పద్దతి కాదు
కరోనాతో సహజీవనం చేయాలంటున్న నేతల తీరును విద్యాసాగర్ రావు తప్పుపట్టారు. కరోనాను టీవీల్లో రంగు రంగుల్లో చూసి మాకు కూడా వస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారని.. టీవీల్లో దాన్ని అంత గొప్పగా చూపించడం ఆపాలని ఆయన అన్నారు. కరోనాతో కలిసి సహజీవనం చేయాలని కొందరు మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. కరోనాను నియంత్రించాలి తప్ప.. సహజీవనం చేయడమేంటి? అది చాలా ప్రమాదకరమైన వైరస్ అని ఆయన అన్నారు. కరోనాను నియంత్రించేందుకు దేశంలోని లక్షలాది గ్రామాలు కృషి చేశాయని అన్నారు. కరోనా నియంత్రణలో గ్రామాల పట్టుదల చూస్తుంటే.. పంచాయతీ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమైందని ఆయన అన్నారు. కవి సినారే స్ఫూర్తితో కరోనా కట్టడికి కృషి చేయాలని ఆయన అన్నారు. “మరణం నన్ను వరించి వస్తే.. పాలుపట్టి జోలపాట పాడి పడుకోబెడ్తాను” అని సినారే అన్నారని విద్యాసాగర్ రావు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అదేనని.. దాన్ని అలాగే కంటిన్యూ చేయాలని ఆయన అన్నారు. కరోనా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావొద్దని ఆయన అన్నారు. తేలు మంత్రం వచ్చినోడు.. పాము నోట్లో వేలుపెట్టినట్లు కొంతమంది వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కొంతమంది నాయకులు చేతగాక కరోనాతో సహజీవనం చేద్దామంటున్నారని ఆయన అన్నారు. ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ.. కరోనాకు చిక్కకుండా ప్రాణాలు దక్కించుకోవాలని ఆయన సూచించారు.

For More News..

కేంద్ర ప్యాకేజీపై కేసీఆర్ మాట్లాడిన తీరు సరికాదు: కిషన్ రెడ్డి

లాక్డౌన్ లో సడలింపులు.. జనంతో నిండిన హైదరాబాద్ రోడ్లు

కిస్సింగ్ వీడియో వైరల్.. యువతుల్ని చంపేసిన కుటుంబసభ్యులు

విడాకులకు దరఖాస్తు చేసిన ప్రముఖ నటుడి భార్య