
ముంబై: మహారాష్ట్రలో ఫోన్ ట్యాపింగ్ వివాదం ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో అప్పటి ఫడ్నవీస్ సర్కారు ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్ చేయించిందని, సైబర్‌సెల్‌కు ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇచ్చిందని ప్రస్తుత హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురువారం ఆరోపించారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి తీసుకురావడానికి కొంతమంది అధికారులను ఫడ్నవీస్ సర్కారు ఏకంగా ఇజ్రాయెల్‌కు పంపించిందని చెప్పారు. వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడడం ఎంతవరకు కరెక్టని దేశ్‌ముఖ్ ప్రశ్నించారు. బీజేపీ నేతలతో తమకున్నది రాజకీయ వైరుధ్యమేనని, వ్యక్తిగతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, రిపోర్టు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించినట్లు హోంమంత్రి చెప్పారు. శుక్రవారం దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్స్పందించారు. తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు బీజేపీ నేత ఒకరు వెల్లడించారని చెప్పారు. మహారాష్ట్ర వికాస్ అగాదీ(ఎంవీఏ) ఏర్పాటు చేస్తున్న టైంలో ఈ తతంగం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేశామని రౌత్ తెలిపారు. దీనిని తట్టుకోలేక.. కక్ష సాధించేందుకే ఎన్సీపీ చీఫ్శరద్ పవార్‌కు ఢిల్లీలో సెక్యూరిటీ తగ్గించారని ఆరోపించారు. ‘నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నానో వినాలనుకుంటే నాకు అభ్యంతరంలేదు. బాలాసాహెబ్ శిష్యుడిని.. ఏంచేసినా ఓపెన్‌గానే చేస్తా’ అని సంజయ్ రౌత్ చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ కూడా మహారాష్ట్రలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను మాజీ సీఎం ఫడ్నవీస్ ఖండించారు. అలా చేయడం తమ ప్రభుత్వ కల్చర్ కాదని, ఎప్పుడూ అలాంటి పనులకు పాల్పడలేదని అన్నారు. ప్రభుత్వం దానిపై విచారణ చేసుకోవచ్చని చెప్పారు.
ట్యాపింగ్ మా సంస్కృతి కాదు: ఫడ్నవీస్
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అవాస్తవం. అది మా సంస్కృతి కానేకాదు. అలాంటి ఆర్డర్స్ ఏవీ మా ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం ఎలాంటి విచారణ అయిన జరిపించుకోవచ్చు. మహారాష్ట్ర ప్రజలకు నిజం తెలుసు. ఆరోపణలు చేస్తున్న వారి విశ్వసనీయత ప్రపంచానికంతటికీ తెలుసు