కేసీఆర్ ‘తెలంగాణ మోడల్’​ నిజమేనా? స్టడీ చేస్తున్న మహారాష్ట్ర జర్నలిస్టులు

కేసీఆర్ ‘తెలంగాణ మోడల్’​ నిజమేనా? స్టడీ చేస్తున్న మహారాష్ట్ర జర్నలిస్టులు
  • స్టడీ చేస్తున్న మహారాష్ట్ర జర్నలిస్టులు
  • రాష్ట్రంలో 3 రోజులుగా పర్యటన
  • పలు పార్టీల నేతలు, ప్రముఖులతో భేటీ

హైదరాబాద్, వెలుగు: ‘మహారాష్ట్ర పర్యటనలో కేసీఆర్ పదే పదే చెప్తున్న ‘తెలంగాణ మోడల్’​లో నిజమెంత? నిజంగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా? ’ అనే అంశాలపై మహారాష్ట్ర జర్నలిస్టులు స్టడీ చేస్తున్నారు. మూడు రోజులుగా హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆరుగురు సభ్యుల జర్నలిస్టుల టీమ్​పర్యటిస్తున్నది. బీఆర్ఎస్​చీఫ్, సీఎం కేసీఆర్​ తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. గత కొన్ని నెలల్లోనే ఐదు సార్లు మహారాష్ట్రకు వెళ్లారు. ఇటీవల 600 కార్ల భారీ కాన్వాయ్​తో సోలాపూర్​కు వెళ్లివచ్చారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఫ్రీ కరెంట్, ఇంటింటికి నీళ్లు, కాళేశ్వరంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని.. రైతుబంధు, బీమా, దళితబంధు సహా అనేక స్కీమ్​లతో దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నామని కేసీఆర్ చెప్పుకుంటున్నారు.

 ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ కేసీఆర్​చెప్తున్న మాటల్లో నిజమెంతో తెలుసుకోవడంపై ఫోకస్​ పెట్టినట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్​చవాన్​ సూచనతో ఆ రాష్ట్ర జర్నలిస్టుల బృందం తెలంగాణలో అడుగు పెట్టినట్టుగా సమాచారం. ఈ టీమ్​ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, కొత్త సెక్రటేరియెట్, అంబేద్కర్ ​విగ్రహం, అమరజ్యోతి సహా అనేక ప్రాంతాలను సందర్శించింది. ఈ పర్యటనలో రైతులు, దళితులు, ఇతర వర్గాల ప్రజలను కలిసి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆరా తీసింది.

రేవంత్, కోదండరామ్, ప్రవీణ్​కుమార్ తో భేటీ

మహారాష్ట్ర జరల్నిస్టుల బృందం తమ పర్యటనలో భాగంగా పలు పార్టీల ప్రెసిడెంట్లు, ప్రముఖులతో భేటీ అయింది. బుధవారం జూబ్లీహిల్స్​లో పీసీసీ చీఫ్ ​రేవంత్​ రెడ్డిని కలిసింది. అలాగే, టీజేఎస్​ చీఫ్​ప్రొఫెసర్ ​కోదండరామ్, బీఎస్పీ స్టేట్​ చీఫ్​ఆర్ఎస్​ప్రవీణ్ ​కుమార్, ప్రొఫెసర్​హరగోపాల్, రిటైర్డ్​ఐఏఎస్​ఆకునూరి మురళితో పాటు మరికొందరు ప్రముఖులను కలిసింది. కేసీఆర్​ చెప్తున్న అభివృద్ధి మోడల్, తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఇతర అంశాలపై చర్చించింది. బీఆర్ఎస్ ​ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న కొందరు ప్రముఖులతోనూ సమావేశమైంది. రైతులు, దళితులు, ఇతర కులాల వారి అభిప్రాయాలనూ తీసుకుంది. 

అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారు? మిషన్​ భగీరథ అమలు తీరు ఎలా ఉంది? తదితర వివరాలూ సేకరించింది. వీటితో పాటు వివిధ రంగాల ప్రముఖులు ప్రభుత్వంపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు, తమ ఫీల్డ్​విజిట్​లో వెల్లడైన వాస్తవాలతో జర్నలిస్టుల బృందం రిపోర్ట్​తయారుచేసి అశోక్​చవాన్​కు అందజేసే అవకాశముందని తెలిసింది.