భారత్​కు శివాజీ పులి పంజా వాఘ్‌‌నఖ్

భారత్​కు శివాజీ పులి పంజా వాఘ్‌‌నఖ్
  • రేపు ఎంఓయూపై సంతకాలు

ముంబై:ఛత్రపతి శివాజీ మహారాజ్‌‌ ఉపయోగించిన'వాఘ్‌‌నఖ్’(పులిపంజా బాకు)ను యూకే నుంచి భారత్ కు తీసుకురానున్నట్లు మహారాష్ట్ర కల్చరల్ ఎఫైర్స్ మినిస్టర్ సుధీర్ ముంగంటివార్ వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి బ్రిటన్‌‌కు బయలుదేరి వెళ్లిన ముంగంటివార్ అంతకుముందు ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. 

శివాజీ ఆయుధాన్ని మూడేళ్లపాటు భారత్‌‌లో ఉంచేలా మహారాష్ట్ర ప్రభుత్వం, లండన్‌‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్  మ్యూజియం మధ్య  ఎంఓయూ కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. ఎంఓయూపై ఇరుపక్షాలు లండన్​లో మంగళవారం సంతకాలు చేయనున్నాయని వెల్లడించారు. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాక అతి త్వరలో ‘వాఘ్‌‌ నఖ్‌‌’ను మహారాష్ట్రకు తీసుకొస్తామని ముంగంటివార్  పేర్కొన్నారు. 

1659లో బీజాపూర్ సుల్తానేట్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌‌ను చంపడానికి శివాజీ మహారాజ్ ఈ 'వాఘ్ నఖ్' ఉపయోగించారు. 
ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం జరిగి 350 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన ఉపయోగించిన 'వాఘ్ నఖ్'ను స్వదేశానికి తీసుకురానున్నట్లు ముంగంటివార్ చెప్పారు.