షిండే వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట

షిండే వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట
  • అనర్హత నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు గడువు
  • అనర్హత నోటీసులపై జూలై 11 వరకు యథాతథ స్థితి
  • రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్లపై ఠాక్రే సర్కార్ కు నోటీసులు
  • అనేక మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయాలు 
  • షిండే వర్గానికి రక్షణ కల్పించాలని ఠాక్రే సర్కార్ కు  ఆదేశాలు

మహారాష్ట్ర రాజకీయాలు అనేక కీలక మలుపులు తిరుగుతున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఇచ్చిన అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ ఏక్ నాథ్ షిండే బృందం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు (జూన్ 27న) విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై తమ స్పందన తెలియజేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఏక్ నాథ్ షిండే బృందానికి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకూ గడువు కల్పిస్తూ సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకూ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఠాక్రే సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. 

మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు సూర్యకాంత్, జేబీ పార్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం(జూన్ 27న) విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై ఐదు రోజుల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు, శాసనసభా పక్ష నేత అనిల్ చౌదరికి నోటీసులు జారీ చేసింది. అలాగే కౌంటర్ అఫిడవిట్లపై షిండే వర్గం మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొంది. 

మరోవైపు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్‌ గ్రూప్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌ను సుప్రీంకోర్టు కోరింది. అయితే రెబల్‌ బృందం అవిశ్వాస తీర్మానాన్ని ఈమెయిల్‌ ద్వారా పంపారని డిప్యూటీ స్పీకర్‌ తరుఫు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ కోర్టుకు తెలిపారు. దీంతో డిప్యూటీ స్పీకర్‌ కార్యాలయంలో అన్ని రికార్డులను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిప్యూటీ స్పీకర్ పై తాము తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం పెండింగ్ లో ఉన్నందున ఆయన అనర్హత నోటీసులు ఇవ్వడం చట్టబద్దం కాదని పిటిషన్ లో షిండే బృందం పేర్కొంది. కేవలం 15 మంది మద్దతు ఉన్న వ్యక్తి శివసేన శాసనసభా పక్షనేత కాలేరని, అందువల్ల అజయ్ చౌదరి నియామకం చెల్లదని శిండే వర్గం పిటిషన్ లో పేర్కొంది. తమకు అనర్హత నోటీసులు పంపిన డిప్యూటీ స్పీకర్‌ అధికారాన్ని షిండే వర్గం సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. ఆయన హోదానే అనుమానంగా ఉన్నప్పుడు అనర్హతపై వ్యవహరించే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదన్నారు. ‘అసెంబ్లీ సమావేశాలు జరగకపోయినా పర్వాలేదు. అసెంబ్లీ ఎప్పుడు సమావేశమైనా, డిప్యూటీ స్పీకర్‌ తొలగింపు తీర్మానం మొదటి అంశంగా ఉండాలి’ అని తిరుగుబాటు ఎమ్మెల్యేల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటు ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు.

హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు..
హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే.. తమకు, తమ కుటుంబాలకు బెదిరింపులు వస్తున్నాయని, అందుకే బాంబే హైకోర్టును ఆశ్రయించలేదని రెబల్‌ ఎమ్మెల్యేల తరుఫు న్యాయవాది నీరజ్ కా కౌల్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. శివసేనపై తిరుగుబాటు చేసిన 39 మంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలకు, వారి  ఆస్తులకు రక్షణ, భద్రత కల్పించాలని ఠాక్రే సర్కార్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రెబల్ ఎమ్మెల్యేలకు, వారి ఆస్తులకు ఎలాంటి హాని జరగబోదని ప్రభుత్వ న్యాయవాది చెప్పిన విషయాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. తదుపరి విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేసింది.