
26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలర్పించిన పోలీసు పేరును ఓ గ్రామానికి పెట్టారు. 14 ఏళ్ల క్రితం ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పీఎఫ్)కు చెందిన కానిస్టేబుల్ రాహుల్ షిండే చనిపోయాడు. షోలాపూర్ జిల్లాలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన షిండే... ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. ఆయన త్యాగానికి గుర్తుగా రాహుల్ స్వగ్రామానికి రాహుల్ నగర్ గా మార్చాలని గ్రామస్థులు నిర్ణయించారు. దీనిపైన త్వరలోనే అధికార ప్రకటన వెలువడనుంది.
"గ్రామం పేరు మార్చడానికి అన్ని ప్రభుత్వ లాంఛనాలు పూర్తయ్యాయి. మేము ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాము" అని దివంగత రాహుల్ షిండే తండ్రి సుభాష్ విష్ణు షిండే వెల్లడించారు. సుల్తాన్‌పూర్‌లో 600 ఇళ్లున్నాయి. వెయ్యి మంది జనాభా ఉన్నారు. ఇప్పటికే 2010లో గ్రామంలో రాహుల్ స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా నవంబర్ 26, 2008న, పాకిస్తాన్ నుండి 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి కాల్పులు జరిపారు. ముంబైలో 60 గంటల ముట్టడిలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.