- అధికార కూటమికి పోటీ లేకపోవడంతో ఆ పార్టీఅభ్యర్థులదే విజయం
- ఈ నెల 15న కార్పొరేషన్ ఎన్నికలు
ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ పోరులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఎన్నికలకు ముందే అధికార మహాయుతి కూటమి చాలాచోట్ల ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నది. మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 68 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మాలేగావ్‌లో ఇస్లాం పార్టీకి చెందిన అభ్యర్థి ఎన్నిక కూడా ఏకగ్రీవం కాగా.. గెలుపు ఖాయం చేసుకున్న వారి సంఖ్య 69కి చేరింది.
మొత్తం 2,869 స్థానాలకు శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసింది. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. దీంతో పోటీలేక అధికార కూటమి అభ్యర్థులకు విజయం లభించింది. ఇందులో బీజేపీ 44 , ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 22, అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ రెండు స్థానాలు గెలుచుకున్నాయి.
కళ్యాణ్- డోంబీవాలి మున్సిపల్ కార్పొరేషన్(కేడీఎంసీ) లో అత్యధికంగా 22 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇది మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్ సొంత ప్రాంతం. మంత్రి గిరీశ్ మహాజన్ ఇలాకా అయిన జల్గావ్ లో12 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలిచారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇద్దరు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు
మహాయుతిపై శివసేన (యూబీటీ) ఫైర్
ఈడీలాంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంలను అడ్డుగా పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను మహాయుతి కూటమి బెదిరించిందని శివసేన (యూబీటీ) ఆరోపించింది. బెదిరింపులు, లంచం ఆఫర్ చేసి ఇతర పార్టీల అభ్యర్థుల నామినేషన్లు విరమించుకునేలా చేశారని ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్ ఆరోపించారు. కాగా, శివసేన (యూబీటీ) ఆరోపణలను బీజేపీ ప్రతినిధి కేశవ్ ఉపాధ్యే కొట్టిపారేశారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సక్పాల్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తమ బలాన్ని దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి” అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చాలాచోట్ల అధికార కూటమి అభ్యర్థులకు పోటీగా నామినేషన్లు దాఖలు కాకపోవడం,
నామినేషన్ల ఉపసంహరణపై ఎన్నికల సంఘం(ఈసీ) స్పందించింది. ప్రతిపక్షాల ఆరోపణల
నేపథ్యంలో దర్యాప్తు జరిపించనున్నట్లు పేర్కొంది.
