దేశంలో ఏం జరుగుతుందో అంతా తెలుసు.. బీఆర్ఎస్ తప్పక కొట్లాడుతుంది

దేశంలో ఏం జరుగుతుందో అంతా తెలుసు.. బీఆర్ఎస్ తప్పక కొట్లాడుతుంది

మహారాష్ట్ర నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బుధవారం (ఏప్రిల్ 26) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో మహారాష్ట్ర నేతలు, కార్యకర్తలకు కండువా కప్పిన సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా దేశ నీటి సమస్యపై మాట్లాడిన కేసిఆర్.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని లేవనెత్తారు. 

75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో ఎక్కడి సమస్య అక్కడే ఉండటానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు కేసీఆర్. కరెంటు విషయంలో తెలంగాణలో తప్ప, దేశమంతా సంక్షోభమే ఉందని ప్రజలతో అన్నారు. దేశంలో కావల్సినన్ని నీళ్లు ఉన్నా.. వాటిని ప్రజలకు అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. తెలంగాణలో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లో ప్రజలు ఏ నీళ్లు తాగుతున్నారో.. ఆదిలాబాద్ జిల్లాలోని గోండు బిడ్డలు అదే నీళ్లు తాగుతున్నారని కేసీఆర్ తెలియజేశారు.

నీళ్ల సమస్య చిన్నది అనుకుంటున్నారు.. కానీ, రానురాను పెను ప్రమాదంగా మారుతుంది. ఈ విషయం గురించి ఏ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కావటం లేదని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర గడ్చిరోలిలో గోదావరి ప్రవహిస్తుంది. అయినా అక్కడ నీటి సమస్యే ఉంది.

కోట్ల ఎకరాలకు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయన్న కేసీఆర్.. దేశంలోని ప్రతీ ఎకరానికి, గ్రామానికి నీళ్లు అందిచడమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యం అని వివరించారు. దేశంలో ఏం జరుగుతుందో అన్నీ మన కళ్లముందే ఉన్నాయి. మీలో చైతన్యం రానంత వరకు మార్పు రాదు. ప్రభుత్వాలను ఎండగడితేనే అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు.