- సిటీలో ఘనంగా జయంతి వేడుకలు
సిటీ నెట్వర్క్, వెలుగు: మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు సిటీలో శనివారం ఘనంగా జరిగాయి. హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. పూలే దంపతులు చేసిన సామాజిక పోరాటం స్ఫూర్తిదాయకమని, వారికి కేంద్ర ప్రభుత్వం వెంటనే భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. లాలాపేటలో జరిగిన మరో కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, టీటీయుసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేశారు.
పూలే భవిష్యత్తు తరాలకు మార్గదర్శి అని కొనియాడారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్లో జరిగిన వేడుకల్లో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని పూలేను ‘ఆధునిక యుగపురుషుడు’గా అభివర్ణించారు. అడిక్మెట్ ఫ్లైఓవర్ కింద ఉన్న పూలే విగ్రహానికి ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
