ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మిడ్జిల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రజలకు తెలియకుండా కేసీఆర్ సర్కార్​తొక్కిపెడుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. బుధవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్​హాల్​లో బీజేపీ కిసాన్​మోర్చా ఆధ్వర్యంలో కార్యకర్తలకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీకే అరుణ  రైతు పథకాలపై కిసాన్ మోర్చా లీడర్లకు పలు సూచనలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం  వ్యవసాయ రంగంపై ఫోకస్​పెట్టి సబ్సిడీ ద్వారా ఎరువులను, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తోందన్నారు. కేసీఆర్  సర్కార్​రైతు బంధు పేరుతో ధనవంతులకే లాభం చేకూరుస్తుందని విమర్శించారు. రైతులకు మేలు చేసే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. బీజేపీ జిల్లా నాయకురాలు బాల త్రిపుర సుందరి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బుక్క నవీన్, కిసాన్ మోర్చా వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 

అవినీతిలో మునిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు : బీజేపీ నేత దిలీప్ కుమార్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ పార్టీ  లీడర్లు అవినీతిలో మునిగి తేలుతూ,  వందల కోట్ల రూపాయలను సంపాదించుకున్నారని బీజేపీ  నేత, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ విమర్శించారు. బుధవారం నాగర్ కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో ‘ బీజేపీ భరోసా’ యాత్ర బైక్​ర్యాలీని ప్రారభించారు. అనంతరం శ్రీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల  అఫిడవిట్​లో లక్షల రూపాయల ఆస్తులు చూపిన ఎమ్మెల్యేలు, 2018 ఎన్నికలప్పుడు వందల కోట్ల ఆస్తులు చూపారని, అది ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఈడీ, ఐటీ సంస్థలు అక్రమార్కులపైనే  దాడులు చేస్తుందని, సాధారణ ప్రజల జోలికి రాదన్నారు. పాలు అమ్ముకునే మల్లారెడ్డికి వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ ఆచారి, పార్లమెంటు మాజీ కన్వీనర్ బి.సుధాకర్ రెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి, కొండ నగేశ్​తదితరులు పాల్గొన్నారు.

పోడు దరఖాస్తులు డివిజనల్ ​కమిటీకి పంపాలె :కలెక్టర్ ఉదయ్ కుమార్ 

నాగర్ కర్నూల్, వెలుగు: పోడు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సర్వే చేసి, గ్రామసభలో చర్చించి సబ్ డివిజనల్ కమిటీకి పంపాలని కలెక్టర్  పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.  మంగళవారం కొల్లాపూర్ డివిజన్ లో వచ్చిన పోడు దరఖాస్తులపై కొల్లాపూర్ ఎంపీపీ ఆఫీస్ లో ఫారెస్ట్​, రెవెన్యూ ఆఫీసర్లు, సిబ్బందితో సమీక్ష  నిర్వహించారు. ఒక్కో పంచాయతీ సెక్రటరీ పరిధిలో వచ్చిన మొత్తం దరఖాస్తులు, అందులో గిరిజనులవి,  గిరిజనేతరులవి ఎన్ని? అని ఆఫీసర్లను కలెక్టర్ అడిగారు. కమిటీకి పంపడంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  కొల్లాపూర్ డివిజన్  నుంచి 2,400 దరఖాస్తులు  వచ్చాయని, వాటిని పెండింగ్ పెట్టొద్దన్నారు.  అప్లికేషన్ల మ్యాపింగ్​గురువారం లోగా పూర్తి  చేయాలని ఫారెస్ట్​ఆఫీసర్లను  ఆదేశించారు. ఆర్డీవో హనుమ నాయక్,  ఎఫ్డీవో నవీన్ రెడ్డి, డీటీడబ్ల్యూవో అనిల్ ప్రకాశ్​, డీపీవో కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

హాస్పిటల్ పనులు స్పీడప్​ చేయాలె : కలెక్టర్ వల్లూరు క్రాంతి

అలంపూర్, వెలుగు: అలంపూర్ లో నిర్మిస్తున్న 100 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను స్పీడప్​ చేసి, వచ్చే ఏడాది జనవరి లోగా పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం  కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఎమ్మెల్యే అబ్రహం తో కలిసి హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. రూ.24 కోట్లతో నిర్మిస్తున్న  హాస్పిటల్​పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని , మిగతా ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ,  పార్కింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలంపూర్​లో  జోగులాంబ సన్నిధికి  వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా టూరిజం డెవలప్​చేయాలని కలెక్టర్  క్రాంతి అధికారులను  ఆదేశించారు. జోగులాంబ అమ్మవారికి పూజలు చేశారు. రూ. 2 కోట్ల ఫండ్స్​విడుదలయ్యాయని, వాటితో రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలన్నారు. 

తెలంగాణలో ఊళ్లు పచ్చబడ్డయ్​: ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​

మద్దూరు/ కోస్గిటౌన్, వెలుగు : నారాయణపేట, మహబూబ్​నగర్​జిల్లాల్లోని ఏర్పాటు చేసిన కొత్త మండలాలు కొత్తపల్లి, గుండుమల్​లో ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ ​పలు ప్రభుత్వ కార్యాలయాలను బుధవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీటింగ్​లలో మమాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల వివక్షతో చితికిపోయిన మారు మూల తండాలు, గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో పచ్చబడ్డాయన్నారు. ప్రతి పక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించకుండా గ్రామాల్లో  సీసీ రోడ్డు డ్రైనేజీ  నుంచి క్రిమిటోరియం వరకు చేసిన పనులను  చూడాలని ప్రతిపక్షాలకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పిట్టకథలు చెప్పదని అభివృద్ధి చేసి చూపెడుతోందన్నారు. అందుకే ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులకు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి, చిట్టెం రాంమోహన్ రెడ్డి ,  కలెక్టర్ శ్రీహర్ష, జడ్పీ చైర్ పర్సన్ వనజమ్మ తదితరులు పాల్గొన్నారు.

చిరుతపులి దాడిలో ఐదు గొర్రెలు మృతి

లింగాల, వెలుగు : మండల పరిధిలోని ఎంసీ తండా గ్రామ శివారులోని చెన్నగుట్ట వద్ద చిరుత పులి దాడిలో ఐదు గొర్రెలు చనిపోయిన సంఘటన బుధవారం వెలుగుకి వచ్చింది. గొర్రెల కాపరి కేతావత్ పార్వతి వివరాల ప్రకారం..  మంగళవారం గొర్రెల మందను మేపడానికి గ్రామ సమీపంలోని అడ్డగుట్టకు  వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి మందలో 5 గొర్రెలు లేవని తెలిపింది.  అనుమానంతో ఫారెస్ట్​  ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడంతో బుధవారం వారు వచ్చి అటవీ ప్రాంతంలో వెతకగా 5 గొర్రెల కళేబరాలు కనిపించాయి. బీట్​ఆఫీసర్​ఖాదర్ పాషా వివరణ కోరగా అటవీ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయని తెలిపారు.  అటవీశాఖ అధికారుల పర్మిషన్​ లేకుండా  ఫారెస్ట్​లోకి వెళ్లొద్దని గ్రామస్తులకు చెప్పినా వినడం లేదన్నారు. బాధితులకు  ప్రభుత్వం పరిహారం ఇస్తుందని చెప్పారు. 

ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోండి

వనపర్తి/నాగర్​కర్నూల్ ​టౌన్​, వెలుగు: వనపర్తి జిల్లాలో త్వరలో ప్రారంభించనున్న ‘కంటి వెలుగు’ స్కీం లో పనిచేసేందుకు అన్ని అర్హతలు ఉన్న వారు ఆఫ్తాల్మిక్​ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని  కలెక్టర్ షేక్ యాస్మిన్​బాషా ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి జిల్లాలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 28 ఆప్తాల్మిక్​ ​ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. పూర్తివివరాలకు www.wanaparthy.telangana.gov.in <http://www.wanaparthy.telangana.gov.in> వెబ్ సైట్ లో సంప్రదించవచ్చన్నారు. 

నాగర్ కర్నూల్ జిల్లాలో 50 పోస్టుల భర్తీ..

జిల్లాలో 50 పారామెడికల్ ఆప్తాల్మిక్​ఆఫీసర్ (పీఎంవో)  పోస్టులను భర్తీ చేస్తున్నట్లు  డీఎంహెచ్​వో సుధాకర్ లాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్​సోర్సింగ్​కింద భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ లోపు జిల్లా వైద్యాధికారి ఆఫీస్​లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.  

హక్కులను కాపాడుకోవడం అందరి బాధ్యత:  సీనియర్ సివిల్ జడ్జి సబిత 

నాగర్ కర్నూల్ టౌన్/గద్వాల టౌన్, వెలుగు : రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత  అని నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి సబిత  అన్నారు. బుధవారం తాడూరు మండలంలోని ఇంద్రకల్ గ్రామ రైతు వేదికలో జిల్లా కోర్టు ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమన్యాయం ప్రతి పౌరుడి హక్కు అని, దాని కోసం జిల్లా, మండల న్యాయసేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ  సాయం అందిస్తామన్నారు. బార్​అసోసియేషన్​ప్రెసిడెంట్​శ్రీనివాస్ గుప్తా,  అడ్వకేట్లు రాజశేఖర్, శ్యాంప్రసాదరావు, ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు.  

రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి

భారత రాజ్యాంగం పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అడిషనల్​జూనియర్​సివిల్ జడ్జి గాయత్రి చెప్పారు. బుధవారం ‘రాజ్యాంగ వారోత్సవాల్లో భాగంగా మండల లీగల్ సర్వీస్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో నవోదయ కాలేజీ స్టూడెంట్స్ కు అవేర్నెస్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగంపై మేలు జరిగితే ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందన్నారు.