
మహబూబాబాదాద్, వెలుగు : మహబూబాబాద్జిల్లా కేంద్రంలోని న్యూ కలెక్టరేట్వద్ద ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు మంగళవారం తొలగించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమి సర్వే నెం. 255/1 లోని 30 ఎకరాల్లో సీపీఎం ఆధ్వర్యంలో కొద్ది రోజుల కింద పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు వేసుకోగా అధికారులు తొలగించారు. దీంతో గుట్టల సమీపంలో చెట్లు నరికి.. వాటితో పాటు ప్లాస్టిక్ కవర్లతో డేరాలు ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఎక్సైజ్, మున్సిపల్, ఆర్డీవో ఆఫీసు సిబ్బంది అక్కడికి చేరుకుని తొలగింపు పనులు మొదలుపెట్టారు.
మున్సిపల్ కమిషనర్ ప్రసన్న, మహబూబాబాద్ టౌన్ సీఐ సతీశ్, తహసీల్దార్ ఇమ్మానియల్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పేదలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకున్న వారిని బయటకు పంపించే క్రమంలో తోపులాట జరిగింది. చివరకు అన్ని గుడిసెలను కూల్చివేసి అందరినీ పంపించివేశారు. దీనిపై సీపీఎం ఆఫీసులో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కె. నాగయ్య మాట్లాడుతూ జిల్లా ఆఫీసర్లు రియల్టర్ల కొమ్ము కాస్తున్నారన్నారు. అనేక చోట్ల చెరువు శిఖం భూములు, ప్రభుత్వ భూములను రియల్టర్లు ఆక్రమించినా పట్టించుకోవడం లేదని, పేదలు బతకడానికి గుడిసెలు వేసుకుంటే తొలగిస్తున్నారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్, నాయకులు సూర్ణపు సోమయ్య, గునిగంటి రాజన్న, రాజమౌళి పాల్గొన్నారు.