మోదీతో సీఎం రేవంత్‌‌కు అపాయింట్‌‌‌‌మెంట్ ఇప్పించాలి

మోదీతో సీఎం రేవంత్‌‌కు అపాయింట్‌‌‌‌మెంట్ ఇప్పించాలి
  •     రాంచందర్ రావుకు మహేశ్ గౌడ్  కౌంటర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తమకు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే ..తెలంగాణకు ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తారని తెలిపారు. మూడుసార్లు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు అందులో నెరవేర్చని వాటిపై కూడా చర్చించాల్సి ఉందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉంటూ12 ఏండ్లుగా బీజేపీ చేస్తున్న అభివృద్ధి.. రెండున్నరేండ్ల​తమ కాంగ్రెస్ పాలనలో నెరవేర్చిన హామీలు, చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని రాంచందర్ రావుకు మహేశ్ గౌడ్ సవాల్ విసిరారు. నెలకు రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. నిరుద్యోగుల ఖాతాలో డబ్బులు ఏమయ్యాయని బీజేపీ నేతలను ప్రశ్నించారు.

‘సర్’ ను సీరియస్​గా తీసుకోవాలి

‘సర్’ ను సీరియస్​గా తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. ఆదివారం గాంధీ భవన్​లో ‘సర్’ పై రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకర్గాల సమావేశం జరిగింది. ఇందులో పార్టీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీలు రఘురాంరెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ యాదవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని, సర్ ప్రక్రియపై పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించాలని సూచించారు. సర్‌‌‌‌ పై ఇప్పటికే నియోజకవర్గాల్లో బీఎల్‌‌ఏలకు శిక్షణ పూర్తయిందని, సర్ పేరుతో బీజేపీ లౌకికవాద ఓట్లను తొలగిస్తుందని ఆరోపించారు.