తెలంగాణ నీటి వాటా ఏపీకి తాకట్టు పెట్టిండు.. చికెన్ బిర్యానీ, చేపల పులుసుకు కేసీఆర్‌‌ లొంగిపోయిండు: మహేశ్‌ గౌడ్‌

తెలంగాణ నీటి వాటా ఏపీకి తాకట్టు పెట్టిండు.. చికెన్ బిర్యానీ, చేపల పులుసుకు కేసీఆర్‌‌ లొంగిపోయిండు: మహేశ్‌ గౌడ్‌
  •     మాజీ సీఎం నిర్లక్ష్యం వల్లే బనకచర్ల జీవోలని వెల్లడి
  •     ఫోన్ ట్యాపింగ్ నిందితులకు శిక్ష తప్పదని హెచ్చరిక

నిజామాబాద్, వెలుగు: ఏపీ ప్రయోజనాల కోసం గోదావరిలో తెలంగాణ నీటి వాటా 300 టీఎంసీలు కుదించి తీరని ద్రోహం చేసిన మాజీ సీఎం కేసీఆర్.. ఇప్పుడు నీతి కథలు చెబుతున్నారని పీసీసీ చీఫ్‌ మహేశ్‌​గౌడ్ మండిపడ్డారు. నాటి ఏపీ సీఎం జగన్ పెట్టిన చికెన్ బిర్యానీ, చేపల పులుసు తిని రాష్ట్ర నీటి ప్రయోజనాలు తాకట్టుపెట్టారని ఎద్దేవా చేశారు. 

బుధవారం నిజామాబాద్ డీసీసీ ఆఫీస్‌లో మహేశ్​ గౌడ్​ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘బనకచర్ల విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన ఉదాసీన వైఖరి వల్లే కేంద్రం అడ్డగోలు జీవోలు జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే కేంద్ర ప్రభుత్వానికి దీనిపై వ్యతిరేకత తెలిపినం. కూలే కాళేశ్వరానికి రూ.లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేసి, పదేండ్లు అధికారంలో ఉన్నా.. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు ఎందుకివ్వలేదో చెప్పాలి. వెనుకబడిన మహబూబ్​నగర్ జిల్లాకు ఫండ్స్ కోత ఎందుకు పెట్టారో చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పదిసార్లు ఎత్తిపోస్తేగానీ మల్లన్నసాగర్‌‌కు నీరు రాదు. 

అందుకయ్యే ఎకరం ఖర్చు రూ.50 వేల నుంచి రూ.60 వేలు. అంత ఖర్చు ఎవరైనా పెడతరా? ప్రయోజనాలు ఉన్నాయని తెలిసి కూడా పాలమూరును పక్కనపడేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దీనిని టేక్ అప్ చేసింది”అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 90 శాతం జీవోలు పబ్లిక్ డోమైన్‌లో నుంచి గాయబ్ చేసేవారని, కోర్టుల్లో పలువురు పిటిషన్లు వేస్తే.. పది శాతం జీవోలు మాత్రమే ప్రజలకు తెలిసేలా పెట్టారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌‌కు జీవోలు దాచిపెట్టాల్సిన ఆలోచన కానీ అవసరం గానీ లేదని తెలిపారు.

ఫోన్ ట్యాంపింగ్‌పై పూర్తి విచారణ..

టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం వ్యక్తుల ఫోన్ ట్యాంపింగ్ చాలా పెద్దనేరమని మహేశ్‌ గౌడ్ అన్నారు.​ బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్‌తో చాలా మంది వ్యక్తిగత గోప్యత హరించిందని మండిపడ్డారు. దీనిపై విచారణ వేగంగా పూర్తి చేయడానికి సిటీ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ వేశామని చెప్పారు. 

ట్యాపింగ్‌లో భాగస్వామ్యం ఉన్న అందరినీ మళ్లీ విచారించి, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని ఆయన వెల్లడించారు. బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్‌లో జాయిన్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. 

85 శాతం సర్పంచ్‌లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం మంది సర్పంచ్‌లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచే గెలిచారని మహేశ్‌​గౌడ్ తెలిపారు. ​బడుగుబలహీన వర్గాల రాజకీయ ఎదుగుదలపై కాంగ్రెస్ తపన గ్రామ పంచాయతీ ఎన్నికలు తీర్చాయన్నారు. తమ పార్టీ సర్పంచ్‌లు అత్యధికంగా గెలవడం మరింత సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్‌​రెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ గడుగు గంగాధర్, మానాల మోహన్​రెడ్డి, రాంభూపాల్, శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.