బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ అంటే  బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌‌‌‌కు నోటీసులిస్తే తప్పేంటి?
  • పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి అని పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్ విమర్శించారు. స్వాతిముత్యం లాంటి సెంటిమెంట్ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గాంధీ భవన్‌‌‌‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్​ట్యాపింగ్​ఘోరమైన నేరమని, ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్​కు నోటిసులిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్‌‌‌‌ను 70 ఏండ్ల వయసులో ప్రగతి భవన్ ముందు 7 గంటలు నిలబెట్టినప్పుడు, తలుపులు బద్దలు కొట్టి కోదండరామ్‌‌‌‌ను తీసుకెళ్లినప్పుడు కేసీఆర్‌‌‌‌కు వారి వయసు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్‌‌‌‌లో ప్రమేయం ఉన్న వారందరిపై విచారణ జరుగుతుందన్నారు. కేటీఆర్, హరీశ్​రావు, సంతోష్​రావు తరహాలోనే అధికారులు కేసీఆర్​కు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్‌‌‌‌ను నీతిమంతుడిగా చూపించే ప్రయత్నం నవ్వు తెప్పిస్తోందన్నారు. 

ఆయన ఇప్పటికీ రాచరిక పాలన భ్రమలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, తన పని తాను చేస్తే నిందలు వేయడం విచారకరమన్నారు. శిబూ సోరెన్, జయలలిత, మాయావతి, యడ్యూరప్ప, లాలూప్రసాద్ యాదవ్ వంటి సీఎంలే విచారణ ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్‌‌‌‌కు అనుమతి ఉంటుందని, కేసీఆర్ ఆజ్ఞ లేనిదే ట్యాపింగ్ జరగలేదన్నది వాస్తవమన్నారు.

పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి, వారిని బ్లాక్‌‌‌‌మెయిల్ చేశారని, భార్యాభర్తల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూశారని ఆరోపించారు. ఆఫీసర్లు నోటీసులు పంపాలనుకునేవారికి వారి పర్మనెంట్ అడ్రస్‌‌‌‌కే పంపుతారన్నారు. సిట్ విచారణతో నిజాలు వెలుగులోకి రావాలని, కేసీఆర్ విచారణలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని చెప్పారు.  

కాంగ్రెస్​ వైఖరిని ప్రజల ముందుంచాలి  

మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌కు సంబంధించిన సిట్ విచారణ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని పీసీసీ చీఫ్​ సూచించారు. డీసీసీల అధ్యక్షులు దీనిపై స్పందించాలన్నారు. కేసీఆర్ పాలనలో అవకతవకలు, అక్రమాలు, ప్రజాధన దుర్వినియోగంపై సిట్ విచారణ జరగాల్సిందేనన్నారు. ఈ విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలనుసహించబోమని హెచ్చరించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని డీసీసీ అధ్యక్షులు ఖండించాలని, కాంగ్రెస్ వైఖరిని బలంగా ప్రజల ముందుంచాలని చెప్పారు.