మన అభ్యర్థులను గెలిపించండి..మీ రాజకీయ భవిష్యత్తుకు నాది భరోసా: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మన అభ్యర్థులను గెలిపించండి..మీ రాజకీయ భవిష్యత్తుకు నాది భరోసా: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించి విఫలమైన నేతలతో భేటీ 
  • హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తాం: చనగాని 

హైదరాబాద్, వెలుగు:  ఖమ్మం, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని టికెట్ ఆశించి, విఫలమైన నేతలను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కోరారు. పార్టీ నాయకత్వంపై కొంత అసంతృప్తితో ఉండడంతో వారందరినీ శనివారం గాంధీ భవన్‌కు పిలిపించుకొని పీసీసీ చీఫ్ బుజ్జగించారు. టికెట్ రాకపోయినా బాధ పడవద్దని, భవిష్యత్​లో గుర్తింపు ఉంటుందన్నారు.

ఖమ్మం, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ హైకమాండ్ ఒకే సామాజికవర్గం వారిని ఎంపిక చేయడంలో ప్రత్యేక కారణాలు ఉన్నాయని, దీన్ని అర్థం చేసుకొని సామా రామ్మోహన్ రెడ్డి, సర్వొత్తమ్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల్లో, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో, పార్టీ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు ప్రాధాన్యత ఇస్తామని వారికి పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు.  

అనంతరం పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని, అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. టికెట్ కోసం అర్హత ఉందని ప్రయత్నించామని, అయితే టికెట్ దక్కలేదన్న  అసంతృప్తి లేదన్నారు.