
- వాటాల పంపకాల్లో తేడాతోనే కవిత తిరుగుబాటు: మహేశ్ గౌడ్
- కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరో కవితే చెప్పాలన్న పీసీసీ చీఫ్
న్యూఢిల్లీ, వెలుగు: పదేండ్ల అవినీతి వాటాల్లో పంపకాల తేడాతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిరుగుబాటు జెండా ఎగరేశారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్, కవిత, హరీశ్ తీరుతో బీఆర్ఎస్ మూడు ముక్కలు అవుతుందని, తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి ఆ పార్టీ కనుమరుగవడం ఖాయమన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ శబరి బ్లాకులో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత తీరుతో కేటీఆర్ మతిభ్రమించి, అసలు విషయం నుంచి దృష్టి మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ముందు ఆయన ఇంట్లో కుంపటి సంగతేంటో చూసుకోవాలని హితబోధ చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలన తప్పిదాలపై స్వయంగా కేసీఆర్ కు కవిత లేఖ రాశారంటే, పరిస్థితి ఏ రీతిలో ఉందో చెప్పక్కర్లేదన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పదేండ్ల అవినీతి, అక్రమాలను అందరూ మర్చిపోయారని కేటీఆర్ అనుకుంటే అది భ్రమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ప్రజల ఆకాంక్షల మేరకు కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేసీఆర్, హరీశ్ రావుతోపాటు మరికొందరికి నోటీసులు ఇస్తే కేటీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడ తమ అవినీతి భయపడుతుందో అనే ఆందోళనతో పిచ్చి కూతలు కూస్తున్నారని ఫైర్ అయ్యారు.
అయితే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవిత లేఖ రాశారని అనుమానం వ్యక్తం చేశారు. కవిత రాసిన లేఖ, ఆమె మాటలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. లిక్కర్ కేసులో కవిత ఇరికినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్లి కేటీఆర్ బేరసారాలు నడిపారని ఆరోపించారు. బెయిల్ వచ్చేలా ఇరువురి మధ్య ఒప్పందం కుదిరిందని, ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా విస్మరించలేదన్నారు. అధికార కాంక్షలో కేటీఆర్, కవిత మధ్య వైరం తీవ్రస్థాయికి చేరిందని, అదును కోసం హరీశ్ రావు చూస్తున్నారన్నారు. ఇవన్నీ తట్టుకోలేకనే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అయినట్లు చెప్పారు.కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలెవరో కవితనే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.