హైదరాబాద్, వెలుగు: ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఈ నెల14న చేపట్టే ధర్నాను సక్సెస్ చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలను ఢిల్లీకి తరలించాలని డీసీసీ చీఫ్ లకు పిలుపునిచ్చారు. మంగళవారం డీసీసీ చీఫ్ లు, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు తమ పనితీరును నిరూపించుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు అందరినీ కలుపుకొని పోవాలన్నారు.
సోనియా దృఢ సంకల్పంతోనే తెలంగాణ
సోనియా గాంధీ దృఢ సంకల్పంతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని మహేశ్‌గౌడ్ అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో సోనియా గాంధీ బర్త్ డే నిర్వహించారు. మహేశ్ గౌడ్ కేక్ కట్ చేసి మాట్లాడారు. యువకులు, విద్యార్థుల ఆత్మబలిదానాలతో చలించిపోయిన సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని చెప్పారు. తెలంగాణ తల్లి సోనియా అని స్పష్టం చేశారు. విశ్వనగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉండాలన్నదే ఆమె ఆకాంక్ష అని, ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వినోద్ కుమార్, ఇతర నేతలు మహిళలకు చీరెలు, బెడ్ షీట్లు పంపిణీ చేశారు.

